Tuesday, November 26, 2024

కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ

కీలక వడ్డీ రేట్లు రెపో రేటు, రివర్స్ రెపో రేటును యధాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభం కాగా.. తాజాగా కమిటీ నిర్ణయాలను శక్తికాంతదాస్ ప్రకటించారు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగుతాయ‌ని చెప్పారు. ఈ మేర‌కు  రేట్లను యథాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని శక్తికాంత్ దాస్ వివరించారు.

ప్రస్తుతం దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి కొన‌సాగుతుండ‌డం, కొన్ని చోట్ల లాక్‌డౌన్‌ ఆంక్షల విధింపు నేపథ్యంలో రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ ల‌క్ష్యాన్ని సాధించడం కోస‌మే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క‌రోనా కార‌ణంగా ఆర్థిక వృద్ధి, రికవరీపై అనిశ్చితి నెల‌కొంద‌ని చెప్పారు.  2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5, సీపీఐ ద్రవ్యోల్బణాన్ని 5.1 శాతంగా అంచనా వేసిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. కాగా, రెపో రేటు విషయంలో యధాతథ స్థితిని కొనసాగించడం వరుసగా ఇది ఐదోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement