Tuesday, November 19, 2024

Big Story: తెలంగాణ‌కు ఊర‌ట‌.. రుణసమీకరణకు ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలంగాణకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. 2022—23 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో తొలిసారిగా రెండు నెలల అనంతరం రుణ సమీకరణకు ఆర్బీఐ ఆమోదముద్ర వేసింది. ఈ నెల 7న బాండ్ల విక్రయం ద్వారా రూ.4 వేల కోట్ల రుణ సమీకరణకు ఆర్బీఐ తెలంగాణకు అనుమతించింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధికి లోబడే రుణ సమీకరణ చేసుకోవాలని ఆర్బీఐ పేర్కొంటూ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్లకు అనుమతించిన షెడ్యూల్‌లో పేర్కొంది. ఇలా ఈ నెల 7న ఏపీకి 14ఏళ్ల పరిమితితో రూ.2 వేల కోట్లు, మహారాష్ట్రకు 8ఏళ్ల కాలపరిమితితో రూ.4 వేల కోట్లు, తమిళనాడుకు 20ఏళ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లకు ఆర్బీఐ అనుమతించింది. తెలంగాణకు 13ఏళ్ల కాలపరిమితితో రూ.4 వేల కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ కుబేర్‌ విధానంలో బాండ్ల వేలం నిర్వహించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నెల 7న ఉదయం 10.30గంటల నుంచి 11.30గంటల మధ్య బాండ్ల వేలం నిర్వహించి రూ.4 వేల కోట్ల నిధుల సమీకరణకు ఆర్బీఐ షెడ్యూల్‌ జారీ చేసింది.

ఏ రాష్ట్రమైనా తన జీఎస్‌డీపీలో 35శాతం మేర అప్పు తీసుకునేందుకు వీలుంది. ఇలా తెలంగాణకు రూ.12,20,804 కోట్ల జీఎస్‌డీపీలో 35శాతం అంటే రూ.42,728 కోట్ల అప్పులకు అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో రూ.4102 కోట్ల మూల ధన అప్పులు, రూ.55,532 కోట్ల రుణాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. అయితే వివిధ ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాలకు గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రూ.లక్షా 30 వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని కేంద్రం షరతు విధించింది. దీంతో 17 కార్పొరేషన్లకు చెందిన ఆదాయ వ్యయాలు, వాటి అప్పుల వివరాలను కేంద్రానికి తెలంగాణ సమర్పించింది. వీటి కిస్తీలను రాష్ట్ర బడ్జెట్‌ నుంచే నేరుగా నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో వాటిని రాష్ట్ర అప్పులగానే కేంద్రం పేర్కొని గడచిన రెండు నెలల రుణ సేకరణను నిలిపివేసి రూ.11 వేల కోట్ల అప్పులను సేకరించకుండా ఆపివేసింది. ఈ నేపథ్యంలో సర్కార్‌ ముమ్మరంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రుణ సేకరణ, ప్రస్తుత అవసరాలు, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం, తెలంగాణ జీఎస్‌డీపీ వంటి సమగ్ర అంశాలను వెల్లడించింది. దీంతో కేంద్రం కొంతమేర వెనుకకు తగ్గింది. బడ్జెటేతర అప్పులను ఆయా సంస్థలే తిరిగి చెల్లింపులు చేస్తాయని, లేని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్తామన్న తెలంగాణ ప్రభుత్వ హెచ్చరికలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచనలో పడవేశాయి. ఈ నేపథ్యంలో పునరాలోచనలో పడిన కేంద్రం ఆర్బీఐకి కీలక సూచనలు చేసింది. తెలంగాణ సర్కార్‌పై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.

స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్స్‌ పేరిట ఆర్బీఐ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తూ రుణాలు ఇప్పించడం ఆనవాయితీ. ఇందుకు ప్రతి 15 రోజులకోసారి బాండ్లను ఆర్బీఐ వేలం వేస్తుంది. ఈ వేలంలో నిధుల ఏజెన్సీలైన వాణిజ్య బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు పాల్గొని బాండ్లను కొనుగోలు చేస్తాయి. మొదటి నుంచి తెలంగాణ బాండ్లకు మంచి డిమాండ్‌ వస్తున్నది. ఏప్రిల్‌లో రూ.3 వేల కోట్లు, మే 2, 17 తేదీలలో రూ.3 వేల కోట్లు, రూ.5 వేల కోట్ల రుణ సమీకరణ యత్నాలను కేంద్రం అడ్డకున్న సంగతి తెలిసిందే. తద్వారా గడచిన రెండు నెలల్లో రాష్ట్ర ఖజానాకు రూ.11 వేల కోట్ల లోటు తలెత్తింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.250 కోట్ల రుణాన్ని మాత్రమే తెచ్చుకున్నది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయని ఆర్థిక శాఖ ఆందోళన వెలిబుచ్చింది. మొత్తం ఆదాయ, వ్యయాల వివరాలను కేంద్రంతో ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావు సమగ్రంగా వివరించడంతో కేంద్రం కొంత మెత్తబడింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఉత్తర్వులను జారీ చేసి బాండ్ల వేలానికి అనుమతించింది. దీంతో ఏప్రిల్‌ నెలలో అవసరమైన అనేక వ్యయాలకు కొంతమేర స్వాంతన లభించినట్లయింది. తాజా నిర్ణయంతో తెలంగాణ సర్కార్‌ ఊపిరిపీల్చుకున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement