Thursday, November 21, 2024

ఆర్బీఐ నిర్ణయం, ఒమిక్రాన్‌ టెన్షన్‌.. గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావం ప‌డుతుందా?

న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ అనిశ్చితి, ఆర్బీఐ మోనిటరీ పాలసీ భేటీ నేపథ్యంలో ఈ వారం మార్కెట్లలో అనిశ్చితి కొనసాగే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం కీలకమైన ఈవెంట్లు ఉన్నాయి. ఆర్బీఐ నిర్ణయాలు బుధవారం రానుండగా.. స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు ఈ వారంలో షెడ్యూల్‌ ప్రకారం వెల్లడికానున్నాయి. ఒమిక్రాన్‌కు సంబంధించిన న్యూస్‌ భారీగా వచ్చే అవకాశం ఉంది. ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారంలోనే వెలువడనున్నాయని స్వస్తిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా అన్నారు.

అయితే కీలకమైన ఈ గణాంకాలు శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత ప్రకటించే అవకాశముందన్నారు. భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు శుక్రవారం వెలువడడంతో శుక్రవారం మార్కెట్లు కుప్పకూలాయి. ఆదివారం రాత్రి నాటికి దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 21కి పెరిగింది. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి ఉంటుందని అంచనా వేస్తున్నామని రెలిగారే బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. తొలి ఆర్బీఐ మోనిటరీ పాలసీ నిర్ణయాలను ఇన్వెస్టర్లు గమనిస్తారు. ఈ నిర్ణయాలు డిసెంబర్‌ 8న వెలువడతాయి. ఇక ఐఐపీ, వినియోగదారు ద్రవ్యోల్బణం గణాంకాలు డిసెంబర్‌ 10న వెలువడనున్నాయని ఆయన చెప్పారు. సామ్కో సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ యెషా షా స్పందిస్తూ.. ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు కీలకమని చెప్పారు. కాగా గతవారం సెన్సెక్స్‌ 589.31 పాయింట్లు లేదా 1.03 శాతం మేర క్షీణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement