కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీని అర్జెంటీనా గెలిచింది. రియోలోని మారకానా స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించింది. అర్జెంటీనా ఆటగాడు ఏజెల్ డీ మారియా గోల్ చేసి తన జట్టుకు ఈ విజయాన్ని అందించగా.. 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా ఛాంపియన్‌గా అర్జెంటీనా నిలిచింది. చివరిగా 1993లో కోపా అమెరికా కప్‌ను గెలుచుకున్న అర్జెంటీనా.. ఇప్పటివరకు 15 సార్లు టైటిల్‌ను గెలిచింది. అదేవిధంగా కెప్టెన్ లియోనల్ మెస్సీ సారథ్యంలో తొలిసారిగా అతిపెద్ద టోర్నీని గెలిచినట్లయింది. కాగా కోపా అమెరికా టోర్నీలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ఉరుగ్వే సరసన అర్జెంటీనా నిలిచింది. ఉరుగ్వే జట్టు కూడా 15 సార్లు ఈ టోర్నీలో గెలుపొందింది.
మరోవైపు కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్, అర్జెంటీనా తలపడడం ఇది మూడోసారి. 1937లో తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. అప్పుడు కూడా అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత రెండు సార్లు (2004, 2007) బ్రెజిల్ టైటిల్ సొంతం చేసుకున్నది. ఇప్పటి వరకూ అర్జెంటీనా, బ్రెజిల్ 112 మ్యాచ్‌ల్లో తలపడగా.. బ్రెజిల్ 46 మ్యాచ్‌లు, అర్జెంటీనా 41 మ్యాచ్‌ల చొప్పున గెలుపొందాయి.
ఈ వార్త కూడా చదవండి: ఒలింపిక్స్ అథ్లెట్లకు మహేష్ బూస్టింగ్