Friday, November 22, 2024

Delhi | ఎల్పీజీ డీలర్ల సమస్యలను పరిష్కరించండి.. కేంద్ర మంత్రులకు ఎంపీ రవిచంద్ర వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాలలోని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎల్పీజీ డీలర్ల సంఘం తెలంగాణ అధ్యక్షుడు  జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు సుమన శేఖర్, మాజీ అద్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు తదితరులతో కలిసి ఆయన గురువారం పార్లమెంట్ ఆవరణలో పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని  కలిశారు.

గడిచిన నాలుగేళ్లుగా ఎల్పీజీ డీలర్లకు గృహ సిలిండర్ సరఫరాపై ఇచ్చే కమీషన్ పెంచడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా 200 రూపాయలు తగ్గించడంతో అంతకుముందే వేలాది సిలిండర్లు స్టాక్ పెట్టుకున్న డీలర్లు నష్టపోయారని, తగ్గిన ధరను వారికి రీఎంబర్స్ చేయాలని కోరారు. ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రైల్వే మంత్రితో రవిచంద్ర భేటీ

తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వేస్టేషన్‌లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను రవిచంద్ర కోరారు. పార్లమెంట్ ఆవరణలోని రైల్వే మంత్రి కార్యాలయంలో అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఖమ్మం అతి పురాతన జిల్లా కేంద్రమని, చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రానైట్ పరిశ్రమలు, క్వారీల్లో తమిళనాడుకు చెందిన వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

బీహార్‌కు చెందిన వలస కూలీలు, ఇతర కార్మికులు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైస్ మిల్లులు, ఇతర పరిశ్రమల్లో పనులు చేస్తున్నారని తెలిపారు. వీరంతా తమ సొంత రాష్ట్రాలకు ఈ రైళ్ల ద్వారా వెళ్లాలంటే విజయవాడ లేదా వరంగల్ వెళ్లాల్సి వస్తోందని రవిచంద్ర కేంద్రమంత్రికి వివరించారు. సమస్య తీవ్రతను గుర్తించి వీలైనంత తొందరగా రెండు రైళ్లకు ఖమ్మంలో హాల్ట్ సదుపాయం కల్పించాలని కోరారు. తక్షణమే నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటానని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement