కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. తన అకౌంట్ ఒక గంట పాటు తాత్కాలికంగా పనిచేయలేదని మంత్రి తెలిపారు. ఆ సమయంలో ఆయన ఎటువంటి ఫోటోలను కానీ, వీడియోలను కానీ పోస్టు చేయలేకపోయారు. టీవీ చర్చలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేయడం వల్ల.. ఆ పోస్టులు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై తన ట్విట్టర్ ఖాతా పనిచేయలేదని మంత్రి వెల్లడించారు.
ఇటీవల కొత్త ఐటీ రూల్స్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే మంత్రి అకౌంట్ మాత్రం నెట్ యూజర్లకు కనిపించింది. కానీ మంత్రి అకౌంట్‌లోకి లాగిన్ కావడానికి లేదా పోస్టు చేయడానికి మాత్రం యాక్సెస్ దొరకలేదు. కాంటెంట్ పోస్టు చేస్తున్న సమయంలో డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్ యాక్ట్ నోటీసు వచ్చినట్లు మంత్రి తెలిపారు. అయితే ట్విట్టర్ చర్యలను మంత్రి ఖండిచారు. ఐటీ చట్టంలోని రూల్ 4(8)ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఆయన ఆరోపించారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తన అకౌంట్‌కు యాక్సెస్ ఇవ్వలేదన్నారు.