Wednesday, November 20, 2024

Big story | మినీ మాల్స్‌ గా రేషన్‌షాపులు.. చౌక ధరకే బియ్యంతోపాటు నిత్యావసరాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) కింద పేదలకు చౌక ధరలకే నిత్యావసరాలను సరఫరా చేస్తున్న రేషన్‌ షాపులను మినీ సూపర్‌ మార్కెట్లు లేదా మినీ మాల్స్‌ గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పీడీఎస్‌ కింద తెల్ల రేషన్‌ కార్డుదారులకు బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇదే క్రమంలో రేషన్‌ షాపులను మినీ సూపర్‌ మార్కెట్లుగా మార్చి బియ్యంతోపాటు మరిన్ని నిత్యావసర సరుకులను చౌకధరలకు పేద, సామాన్యులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మినీ సూపర్‌ మార్కెట్ల ద్వారా పేదలకు చౌకగా నాణ్యమైన నిత్యావసరాలు పంపిణీ చేయడంతోపాటు రేషన్‌ షాపులు నడుపుతున్న డీలర్లకు కూడా కమిషన్‌ గిట్టుబాటు అవుతుందని సివిల్‌సప్లైశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పీడీఎస్‌ కింద బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తుండడంతో తమకు కమిషన్‌ గిట్టుబాటు కావడం లేదని, మరిన్ని సరుకులను చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని డీలర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నారు.

రాష్ట్రంలో 10వేలకు పైగా రేషన్‌ షాపులు ఉన్నాయి. గతంలో మాదిరిగా బియ్యం, చక్కెర, గోధుమలు, కిరోసిన్‌తోపాటు మరికొన్ని వస్తువులను రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు. వాస్తవానికి మినీ సూపర్‌ మార్కెట్‌ల డిమాండ్‌ను తెలంగాణ రేషన్‌ డీలర్లు 2018లో ప్రభుత్వం ముందుంచారు. మినీ సూపర్‌ మార్కెట్ల ద్వారా దాదాపు 10కిపైగా నిత్యావసరాలను పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంపిణీ కార్యక్రమాలన్నీ డిజి టల్‌ మాద్యమంలోనే నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని రేషన్‌ షాపులను అక్కడి ప్రభుత్వాలు మినీ సూపర్‌ మార్కెట్లుగా అప్‌గ్రేడ్‌ చేశాయి. బియ్యం, చక్కెర, గోధుమలు, వంట నూనె, కంది పప్పు, కారం, ఉప్పు తదితర నిత్యావసరాలను సబ్సీడీ రేట్లపై అందిస్తున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుండడంతో రేషన్‌ షాపుల ద్వారా అందించే నిత్యావసరాల సరుకుల సంఖ్యను పెంచితే పేద, సామాన్యులకు ఎంతో మేలు జరగనుందని పలు ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రద్దయిన తెలుపు రేషన్‌ కార్డులతోపాటు కొత్త రేషన్‌ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. త్వరలో కొత్త వైట్‌ రేషన్‌ కార్డులు మంజూరు చేయనున్నట్లు ఇటీవల పలు వేదికల మీద ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రి కేటీ. రామారావు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. రద్దు అయిన రేషన్‌కార్డుల్లో అర్హులను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందు కోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లని చిరునామాల ఆధారంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించి అర్హులని తేలితే రేషన్‌ కార్డులను పునరుద్దరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement