ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి: రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి….వీటిని రీ సైక్లింగ్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. చాలామంది రేషన్ బియ్యం తీసుకోవడం లేదు…కొందరు తీసుకున్న కిలోకు రూ. 8 చొప్పున విక్రయాలు చేస్తున్నారు…వీటిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు రీ సైక్లింగ్ చేసి కిలోకు రూ. 30 చొప్పున విక్రయాలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు…ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. అసలైన నిరుపేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం చాలామంది అనర్హులకు కూడా దక్కుతోంది…వీళ్లలో ఎక్కువమంది బియ్యాన్ని అమ్ముకుంటున్నారు…రంగారెడ్డి జిల్లాలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది…అధికార తెరాస ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఇటీవల జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌లో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ వ్యాపారంపై విపులంగా వివరించారు….అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేయడం ద్వారా విలువైన బియ్యం పక్క దారి పడుతున్నాయి…..
నిరుపేదలు మూడుపూటల కడుపునిండ తినేందుకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రతాకార్డులతోపాటు అంత్యోదయ అన్నాయోజన, అన్నపూర్ణ కార్డులకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒకరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. కిలోకు కేవలం రూపాయి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆరుకిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 5.59లక్షల కార్డులు ఉన్నాయి. వీటికి గాను 18,447 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెల పంపిణీ చేస్తున్నారు. ఇందులో దాదాపుగా సగం వరకు రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. వ్యాపారులు రేషన్ బియ్యానికి కిలోకు రూ. 8 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వీటన్నింటిని రీ సైక్లింగ్ చేసి కిలోకు రూ. 30 చొప్పున విక్రయాలు చేస్త్తున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాకపోతే కొంతమేర పాలిష్ తక్కువగా ఉండటంతో కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వీటిని రీ సైక్లింగ్ చేసిన తరువాత ఇతర బియ్యంతో ఇవి పోటీ పడే పరిస్థితులు వస్తున్నాయి. వీటిని మిగతా బియ్యం మాదిరిగా మంచి బ్యాగుల్లో నింపి వీటిని సరఫరా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో వ్యాపారులు ఎలా పక్కదారి పట్టిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్‌పై దృష్టిని కేంద్రీకరించాలని ఆయన సూచించారు….
రేషన్ దుకాణాలు భర్తీ చేయకపోవడంతో…..
రంగారెడ్డి జిల్లాలో 919 రేషన్ దుకాణాలున్నాయి. ఇందులో 131 దుకాణాలు వివిధ కారణాలతో కాళీగా ఉన్నాయి. కాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు సంబంధించి పక్క గ్రామ రేషన్ డీలర్‌కు పంపిణీ బాధ్యతలు అప్పగిస్తారు. అక్కడికి వెళ్లి రేషన్ బియ్యం తీసుకోవల్సి ఉంటుంది. చాలామంది వెళ్లి తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. కొందరికి ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపడంతో వాళ్లు రేషన్ బియ్యం తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 919 రేషన్ దుకాణాలకు ఇంకా 131 దుకాణాలు కాళీగా ఉన్నాయి. వివిధ కారణాలతో రేషన్ డీలర్లను తొలగించారు. దానికితోడు కొత్త పంచాయతీల్లో డీలర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ వివిధ కారణాలతో రేషన్ డీలర్లను భర్తీ చేయడం లేదు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో రేషన్ డీలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో చాలామంది రేషన్ బియ్యం తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇది వ్యాపారులకు కలిసి వస్తోంది. చాలామంది ఇన్‌ఛార్జీ డీలర్లు ఉండటంతో వాళ్లు ఇష్టానుసారం రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ డబ్బులు ఆశచూపి వారికి బియ్యం పంపిణీ చేయడం లేదు. కిలోకు రూ. 8 చొప్పున వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. ఇన్‌ఛార్జీలు ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.
హైదరాబాద్‌కు దగ్గర్లో ఉండటంతో జోరుగా వ్యాపారం….
హైదరాబాద్ మహానగరం చుట్టూరా రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉంది. దీంతో శివారు ప్రాంతాల్లో రీ సైక్లింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎనమిది రూపాయలకు కిలో చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేసి రీ సైక్లింగ్ చేసి రూ. 30 కిలో చొప్పున విక్రయాలు చేస్తున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తున్న వారిలో ఎక్కువమంది రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. వారిలో ఎక్కువమంది ఎనమిది రూపాయలకు కిలో చొప్పున విక్రయాలు చేస్తున్నారు. ఇది వ్యాపారులకు బాగా కలిసి వస్తోంది. సేకరించిన రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లుల్లో రీ సైక్లింగ్ చేయించి కిలోకు రూ. 30 చొప్పున విక్రయాలు చేస్తున్నారు. రీ సైక్లింగ్ చేయడం ద్వారా దండిగా డబ్బులు వస్తుండటంతో ఎక్కువమంది ఈ వ్యాపారంపై మొగ్గు చూపుతున్నారు. రీ సైక్లింగ్ చేసిన తరువాత వాటిని రేషన్ బియ్యంగా గుర్తించడం కష్టమే. మిగతా బియ్యంతో పోటీపడే విధంగా ఎక్కువ పాలిష్ చేసి కొనుగోలుదారులను నిలువున మోసం చేస్తున్నారు.
నామ మాత్రంగా తనిఖీలు….
అసలైన నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో అప్పుడప్పుడు తనిఖీలు చేయడం ద్వారా వ్యాపారులకు కలిసి వస్తోంది. అధికారులు వ్యాపారులతో మిలాఖాత్ కావడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 13 కేసులునమోదు చేశారు. ఇందులో 542.10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 9.20లక్షలు ఉంటుంది. అరకొర తనిఖీలు చేస్తేనే ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తే పెద్దఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కేవలం గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే లేక ఎవరైనా రేషన్ బియ్యాన్ని డీలర్ తరిలిస్తున్నారని ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి హడావుడి చేయడం పరిపాటిగా మారింది. గ్రామాల్లో రాత్రి పూట రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. దీనిపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తే విలువైన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. విలువైన రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ద్వారా ప్రభుత్వ ఆశయం కూడా నెరవేరడం లేదు. కార్డు దారులకు డబ్బులు ప్రలోభపెట్టి ఎక్కువ ధరలకు తీసుకుంటున్నారు. ఇన్‌చార్జీలు ఉన్న ప్రాంతాల్లో అరకొరగా పంపిణీ చేసి మిగతా బియ్యాన్ని ఎక్కువ ధరలకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేయడం ద్వారా దండిగా లాభాలు వస్తుండటంతో వ్యాపారులు తమ వ్యాపారాన్ని వస్తరించుకుంటున్నారు. ఇందులో అధికారుల వాటా కింద పంపిణీ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..