హైదరాబాద్, ఆంధ్రప్రభ : దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనకు సమ్మె బాటపట్టే యోచనలో రేషన్ డీలర్లు ఉన్నారు. ఇప్పటికే తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏప్రిల్ నెలలోనే పౌరసరఫరాలశాఖ కమిషన్ అనిల్‌కు తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అందజేసింది. జూన్ 5 నాటికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 45రోజులు ముందుగానే కమిషనర్‌కు డిమాండ్ నోటీసు అందజేసినట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు తెలిపారు.
వాటిని ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో సమ్మె చేయడం మినహా వేరే దారి లేదని ఆయన తేల్చి చెప్పారు. డీలర్ల సమ్మె నోటీసు నేపథ్యంలో ఈ నెల 22న రేషన్ డీలర్లతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ గంగుల కమలాకర్ సమావేశం కానున్నారు. సమావేశంలో సానుకూల నిర్ణయాలు వెలువడకపోతే జూన్ 5 నుంచి సమ్మెకు దిగేందుకు రేషన్ డీలర్ల సంఘం ఏర్పాట్లు చేసుకుంటోంది. జూన్ 4 లోగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే వివిధ రూపాల్లో ఆందోళనలు, ఉద్యమాలు ఉధృతం చేస్తామని డీలర్లు హెచ్చరిస్తున్నారు. సమ్మె నిర్వహణకు వీలుగా డీలర్లు జేఏసీగా ఏర్పడ్డారు.
రేషన్ డీలర్లకు నెలనెలా గౌరవ వేతనం చెల్లించాలని, ప్రతీ డీలర్‌కు హెల్త్ కార్డు, రేషన్ దిగుమతి హమాలీ ఛార్జీలు ప్రభుత్వమే భరించాలని, కరోనా సమయంలో మృతి చెందిన రేషన్ డీలర్ల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్న తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకులపై కిలోకు ఇస్తున్న 70పైసల కమిషన్‌ను రూ.2కు పెంచాలని కోరుతున్నారు.
కారణ్య నియామకాలు 50 సంవత్సరాలకు ఇవ్వాలని, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీని రేషన్ షాపుల ద్వారా చేపట్టాలని, చనిపోయిన డీలర్ దహన సంస్కారాలకు రూ.50వేలు ఇవ్వాలని, ఒక్కో క్వింటాల్‌కు ఒక్కో శాతం తరుగు ఇవ్వాలని, ప్రతి నెలా ఈ పాస్ మెషిన్‌లో నుంచి క్లోజింగ్ బ్యాలెన్స్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరి ష్కరించాలని 9 సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని డీలర్లు వాపోతున్నారు. 2021లోనూ సమ్మె నోటీసుపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కూడిన సబ్ కమిటీ వేసినా ఇంత వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని వాపోతున్నారు.