Thursday, November 21, 2024

మళ్లీ ‘పీకే’పైనే వైసీపీ భారం… ఈసారి పీకే పాచికలు పారతాయా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగన్ గురువారం జరిగిన కేబినెట్ భేటీలో చెప్పినట్లు వైసీపీ నేతలే మీడియాతో మాట్లాడారు. దీంతో మరోసారి వైసీపీ పీకేపైనే భారం వేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో డీఎంకేని, బెంగాల్లో టీఎంసీని విజయతీరాలకు చేర్చటం వెనుక ఆయన వ్యూహం కూడా ఉందనేది అందరికీ తెలిసిందే. తమిళనాట స్టాలిన్‌, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ గెలుపు కోసం పీకే టీమ్‌ ఆ రెండు రాష్ట్రాల్లో మకాం పెట్టి బ్యాలెట్ పరీక్షలో విజయం సాధించింది.

2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్‌ ప్రణాళికలే ప్రధాన కారణం అని రాజకీయ వర్గాల్లో ఉన్న టాక్. పీకేతో అప్పటినుంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్న సీఎం జగన్ మరోసారి రాబోయే ఎన్నికల్లో తన కోసం పనిచేయాలని ఆహ్వానించినట్టు తెలిసింది. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో మోదీ వ్యతిరేక కూటమి కూర్పు కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్న ప్రశాంత్ కిషోర్ వైసీపీ చీఫ్ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించారని తెలిసింది. పీకే బృందం గత ఎన్నికల్లో “రావాలి జగన్.. కావాలి జగన్”, “అన్నొస్తున్నాడు” అంటూ ఆకర్షణీయ నినాదాలు రూపొందించారు.చంద్రబాబు ప్రభుత్వంపై వివిధ సామాజిక వర్గాల్లో వ్యతిరేకత తీసుకురావటానికి ప్రశాంత్ కిషోర్‌ బృందమే ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆగ్రహంతో ఉంది. ఇతర రాష్ట్రాల్లో మంచి సక్సెస్ రేటు ఉన్న ప్రశాంత్ కిషోర్ వచ్చేసారి ఏపీ ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement