ప్రభన్యూస్: మన వద్ద మంచి టీ పౌడర్ కిలో రూ.400 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. కానీ మీకు తెలుసా.. మన దేశంలోనే డార్జిలింగ్‌లో పండించే ఓ రకం టీ పొడి ధర కిలో రూ.1.30 లక్షలు. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఖరీదైన టీ పొడులు మరికొన్ని ఉన్నాయి. వీటిలో డా హంగ్ పావో అనే టీ పొడి అత్యధికంగా కిలో రూ.10కోట్లు పలుకుతుంది. చైనాలోని వుయి పర్వతాల మీద పెరిగే డా హంగ్ పావో రకం టీ పొడి బంగారం కంటే ఎన్నో రెట్లు ఖరీదైంది. ఈ తేయాకు ఒక్క గ్రాము రూ.లక్షపైనే ఉంటుంది.
పూర్వం స్థానిక చక్రవర్తి అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఓ సన్యాసి ఈ తేయాకులతో టీ చేసి తాగించాడట. వెంటనే ఆయన కోలుకున్నాడట.. అప్పట్నుంచి దీన్ని సంజీవనిలా భావిస్తారు అక్కడి స్థానికులు. పర్వతం పై భాగంలోని ఔషధ మొక్కలను దాటుకుని సున్నపు రాతి కొండల మీదుగా ప్రవహించే నీరు ఈ టీ చెట్లకు ఎన్నో ఔషధ గుణాలను తెచ్చిపెడుతుంది. అందుకే ఎంత నీరసంగా ఉన్నవారైనా.. డా హంగ్ పావో టీని తాగితే ఉత్సాహంగా లేచి తిరుగుతారట.
అయితే అత్యుత్తమమైన హంగ్ పావో తేయాకు వందల ఏళ్ల నుంచి ఉన్న తల్లి చెట్ల నుంచే లభిస్తుంది. అలాంటివి ప్రస్తుతం కేవలం ఆరు చెట్లే ఉన్నాయి. మిగిలినవి అన్నీ ఆ చెట్ల నుంచి అంటు కట్టినవే.. వాటి విత్తనాల నుంచీ పెంచినవే. అందుకే తల్లి చెట్టు నుంచి తీసిన టీపొడి ఖరీదు చాలా ఎక్కువ. 20 గ్రాముల ఈ పొడిని వేలం పెడితే.. రూ.20లక్షలకు అమ్ముడుపోయింది. అరుదుగా దొరుకుతుంది. అందుకే దీన్ని చైనా జాతీయ సంపదగా కూడా ప్రకటించింది.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital