Friday, November 22, 2024

బైరాన్‌పల్లిలో 27న పితృయజ్ఞం.. ఆధారాల్లేకుండా దర్యాప్తు సంస్థలు ముందుకెళ్లవన్న బీజేపీ నేత రాపోలు ఆనందభాస్కర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నిజాం పాలనకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన 118 మంది ఆత్మశాంతి కోసం పితృయజ్ఞం నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ వెల్లడించారు. సిద్ధిపేట జిల్లాలోని బైరాన్‌పల్లి బురుజు వద్ద శాంతి పితృ యజ్ఞం, సంస్మరణ జరుపుతున్నామని చెప్పారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వీర బైరాన్‌పల్లి సంస్మరణ సభలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇదో కీలక ఘట్టమని రాపోలు గుర్తు చేశారు. ఈ ఘటనతో పటేల్ పోలీస్ యాక్షన్ చేపట్టి హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేశారని చెప్పారు. కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రాణత్యాగం చేసిన సాయుధ పోరాట యోధుల కోసం యజ్ఞం చేపట్టామని తెలిపారు. వర్తమాన పాలకులు నాటి నిజాం పాలనను గుర్తుకు తెస్తున్నారని అన్నారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రశ్నలకు రాపోలు ఆనంద భాస్కర్ సమాధానమిచ్చారు. స్వతహాగా ఆవేశపరుడైన రాజాసింగ్ ఆవేశంలో విచక్షణ కోల్పోయి మాట్లాడి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉండడంలో ఆశ్చర్యం లేదని అభిప్రాయపడ్డారు. అవినీతి, అక్రమార్జనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లడం సహజమని విమర్శించారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయన్న ఆనంద భాస్కర్, ఆధారాల్లేకుండా దర్యాప్తు సంస్థలు ముందుకెళ్లవని నొక్కిచెప్పారు. కక్షసాధింపు చర్యలు అనే ఆరోపణ అధికారపక్షం ఎదుర్కోవడం సాధారణమేనని అభిప్రాయం వెలిబుచ్చారు. అధికారపక్షం కింద దర్యాప్తు సంస్థలు పని చేస్తాయి కాబట్టి ఆరోపణలు రావడం సహజమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement