హైదరాబాద్, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన స్టేషన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ రైల్వే చేపట్టిన ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, నూతన భవనాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి వంటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫాంల సుందరీకరణతో పాటు ప్రయాణికులకు తాగునీటి అవసరాలను తీర్చే భారీ రిజర్వాయర్ పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఏపీలోని ముఖ్యమైన నగరాలలో ఒకటైన నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఇటీవలే మద్రాస్ ఐఐటీ ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలించారు. స్టేషన్లో క్రమంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని సమీప భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు వీలుగా ఈ స్టేషన్కు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం జరిగింది.
పనుల్లో మొదటగా సైట్ కార్యాలయాలు నెలకొల్పడం, కాంక్రీట్ ల్యాబ్ టెస్టింగ్, నిల్వ షెడ్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తి కాగా, స్టేషన్కు నూతన శోభను అందించడానికి మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి కొత్త స్టేషన్ భవనం ఇప్పటికే సిద్ధమైంది. వీటితో పాటు రైల్వే కోర్టు, జిఆర్పి కార్యాలయాల నిర్వహణ కోసం తాత్కాలిక షెడ్ల నిర్మాణం పూర్తయింది. భవిష్యత్తు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ప్రస్తుత భవనంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రయాణికులకు అన్ని కాలాల్లో రక్షణ కల్పించడానికి కొత్త స్టేషన్ భవనంలో సిఓపిలు తగినన్ని ఏర్పాటు చేయడం జరగుతుంది.
వీటిని నిర్మించడం కోసం ప్లాట్ ఫాంలపై స్తంభాల నిర్మాణం పూర్తి కాగా, పై కప్పుల పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే, 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ నీటి రిజర్వాయర్ నిర్మాణం తవ్వకం, పనులు కూడా పూర్తయ్యాయి. నెల్లూరు స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పునరాభివృద్ధి పనుల వల్ల ఆధునిక సౌకర్యాలతో ప్రధాన స్టేషన్లకు మరింత నూతన శోభను కల్పించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వీలు కలుగుతుందని చెప్పారు.