న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలోనే విశిష్టమైన డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించవలసినదిగా టీఆర్‌ఎస్ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం 377 నిబంధన కింద డిజైన్ సెంటర్ అంశాన్ని ఆయన లోక్‌సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైటెక్ సిటీలో నేషనల్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. కార్యాచరణ వ్యయంలో 25% నిధులివ్వాలని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించిందని ఆయన గుర్తు చేశారు.
డిజైన్, ఉత్పత్తి అభివృద్ధిలో ఉన్న ఖాళీలను పూరించడం కోసం డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. చేనేత, హస్తకళ, జనపనార, సిల్క్, కార్పెట్, ఇతర ఉపాధి కల్పన రంగాలలో డిజైన్-ఆధారిత నైపుణ్యాన్ని నిర్మించడం, సృష్టించడం లక్ష్యాలుగా నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. గ్లోబల్ పోటీని తట్టుకోవడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో మన డిజైన్‌లకు డిమాండ్ పెంచడానికి ఇది సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. అనేక సానుకూల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌ను ఆమోదించవలసిందిగా రంజిత్ రెడ్డి కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. నేషనల్ డిజైన్ సెంటర్ మొదటి 8 సంవత్సరాల కార్యకలాపాల కోసం 75% కేంద్ర మద్దతును అందించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..