Sunday, November 24, 2024

Ranga Reddy – మా ద‌గ్గ‌రే వాన‌ల్లేవ్‌ – వ్యవసాయం ముందుకు సాగేదెలా?

రంగారెడ్డి జిల్లాపై క‌రుణించ‌ని వ‌రుణుడు
రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం విస్తారంగా వ‌ర్షాలు
రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల్లో భిన్న ప‌రిస్థితులు
అయితే.. వికారాబాద్‌లో కాస్తా న‌యం
సాగుప‌నులు ఎట్లా అని రైతుల్లో ఆందోళ‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం దానికి భిన్నమైన‌ పరిస్థితులు నెల్కొన్నాయి. ఇప్పటి వరకు భారీవర్షం కురిసిన దాఖలాలు లేవు. వర్షాకాలం ప్రారంభమై 50 రోజులు దాటిపోయింది. రికార్డు స్థాయిలో వర్షం లేకపోవడంతో సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అంతంత మాత్ర‌మే ఉన్నాయి. భారీ వ‌ర్షాలు కురిస్తే త‌ప్పా భూగ‌ర్భ జ‌లాలు పెరిగే అవ‌కాశాలు లేవు. వ్యవసాయం ముందుకు సాగాలంటే భారీ వర్షాలు కురవాల్సిందే. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో సాధారణ వర్షాపాతమే నమోదవుతుండగా, వికారాబాద్‌ జిల్లాలో మాత్రం కాస్త నయం అనే విధంగా వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

అడ‌వులు అంత‌రించిపోవ‌డ‌మే..

హైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉంది. వ్యవసాయ భూములను కూడా ప్లాట్లుగా విభజించి నిర్మాణాల చేప‌డుతున్నారు. ఒకప్పుడు చెట్లతో నిండుగా కనిపించే శివారు ప్రాంతాలు ఎడారిగా మారిపోయాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 33 శాతం మేర అటవీ సంపద ఉండేది. ప్ర‌స్తుతం అడ‌వులు అంత‌రించిపోవ‌డంతో ఐదు శాతం కూడా లేని పరిస్థితి. ప్రతి ఏటా దాదాపుగా 80 లక్షల మేర మొక్కలు నాటుతున్నారు. అటవీ సంపద దక్కుతున్న నేపథ్యంలో జిల్లాలో వర్షాల సంఖ్య కూడా ఘ‌న‌నీయంగా తగ్గుతోంది.

సాగుకు ఉప‌యోగ‌ప‌డే వ‌ర్షాలు లేవు..

వానాకాలం సీజన్‌ ప్రారంభమై నెలన్నర దాటిపోయింది. సాగుకు ఉప‌యోగ‌ప‌డే వ‌ర్షాలు ఇంత‌వ‌ర‌కు ప‌డ‌లేదు. సెంటిమీటర్ల మేర వర్షం కురిసిన పరిస్థితులు లేవు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. అంతా వర్షాలపైనే ఆధారపడి సాగు చేయాల్సిన ప‌రిస్థితి. పుష్కలంగా వర్షాలు కురిస్తే తప్పా బోరుబావుల్లోకి నీరు చేరే పరిస్థితులు లేవు.

రంగారెడ్డిలో..

ఈ సారి ఆశించిన మేర వర్షాలు కురవ లేదు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 27 మండలాలున్నాయి. ఇందులో 23 మండలాల పరిధిలో సాధారణ వర్షపాతమే నమోదయింది. నాలుగు మండలాల పరిధిలో మరింత తక్కువ వర్షం కురిసింది. జూన్‌లో సాధార‌ణ 94 మిల్లిమీటర్ల వర్షపాతానికి 97 మిల్లిమీటర్లు కురిసింది. ఈ నెల‌లో 146.6 మిల్లిమీటర్లు సాధారణ వర్షపాతం కాగా ఇప్పటివరకు 121.9 మిల్లిమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో…

మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో 14 మండలాల పరిధిలో సాధారణ వర్షమే కురవగా కేవలం ఒక్క మండలంలోనే సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసింది. ఈ జిల్లాలో 20 మండలాలుండగా ఇందులో 16 మండలాల పరిధిలో సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసింది.

సాగుపై తీవ్ర ప్రభావం

ఆశించినమేర వర్షాలు కురవకపోవడంతో సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో రికార్డు స్థాయిలో వ్యవసాయం కొనసాగుతుండగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో వ్యవసాయం చాలా వరకు తగ్గిపోయింది. మేడ్చల్‌ పరిధిలోని మెజార్టీ ప్రాంతాలు దాదాపుగా హైదరాబాద్‌లో కలిసిపోయాయి. దీంతో ఈ జిల్లాలో సాగు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతోంది.

ముందుకు సాగ‌ని సాగు

రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత సీజన్‌కు సంబంధించి నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పటివరకు కేవలం 1.60 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగు కాలేదు. వికారాబాద్ జిల్లాలో కాస్త మెరుగ్గా ఉన్నా పూర్తి స్థాయిలో సాగు కాలేదు. ఈ జిల్లాలో 5.78లక్షల ఎకరాలు సాధారణ సాగు కాగా ఇప్పటివరకు 3.40 లక్షల ఎకరాల పరిధిలో మాత్రమే పంటలు సాగయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో సాధారణ సాగు కేవలం 23 వేల ఎకరాలే. ఇందులో సాగు చేసింది మాత్రం 4050 ఎకరాల వరకే. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలు కురిస్తే తప్పా వ్యవసాయ పనులు జోరందుకునేలా కనిపించడం లేదు.

ఇప్పుడిప్పుడే ప్రారంభ‌మైన వ‌రి నాట్లు

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో పత్తి, వరి, మొక్క జొన్న పంటలు ప్రధాన పంటలు. ఇవి కూడా పూర్తి స్థాయిలో సాగుకాని పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో వరి నాట్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. నీటి వసతులు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వరినాట్లు వేస్తున్నారు. మెజార్టీ రైతులు భారీ వర్షాలు కురిస్తే తప్పా వరినాట్లు ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లాలో 1.78 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 1.07 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగయ్యింది. లక్ష ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2 వేల ఎకరాల్లో కూడా నాట్లు వేయని పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం సాగు విస్తీర్ణం చాలావరకు తగ్గే ప్రమాదం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement