Saturday, November 23, 2024

పెయింటింగ్‌ కొంటే పద్మభూషణ్‌ ఇస్తారా.. ఇదేంది కపూర్‌ జీ?

కాంగ్రెస్‌ పార్టీ వైఖరిపై యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ సంచలన ఆరోపణలు చేశారు. పీఎంఎల్‌ఏ చట్టం కింద రాణా కపూర్‌పై కేసు నమోదు కావడంతో.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో రాణా కపూర్‌ సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా నుంచి ఎంఎఫ్‌ హుస్సేన్‌ పెయింటింగ్‌ను రూ.2కోట్లు పెట్టి కొనుగోలు చేయాలని ఓ కేంద్ర మంత్రి తీవ్ర ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఆ కేంద్ర మంత్రి ఎవరో కాదని.. యూపీఏ ప్రభుత్వంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేసిన మురళీ దేవరా అని తెలిపారు. పెయింటింగ్‌ కొంటే పద్మభూషణ్‌ పురస్కారం లభిస్తుందనే హామీ ఇచ్చినట్టు కపూర్‌ తెలిపారు. ఈ విషయాలను ముంబైలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఈడీ ప్రస్తావించింది. పెయింటింగ్‌ కొనుగోలు చేయగా వచ్చిన డబ్బులను సోనియా గాంధీ వైద్యం కోసం వినియోగించిందని ఈడీకి కపూర్‌ తెలిపాడు. పెయింటింగ్‌ కొనుగోలు చేయని పక్షంలో గాంధీ కుటుంబంతో తనకు సంబంధాలు ఏర్పడకుండా అడ్డుకుంటానని, పద్మభూషణ్‌ అవార్డును కూడా పొందకుండా చూస్తానంటూ మురళీ దేవరా హెచ్చరించినట్టు ఆరోపించారు.

ఈ పెయింటింగ్‌కు సంబంధించి రూ.2కోట్ల చెక్కును ఇచ్చానని, మిలింద్‌ దేవరా తనతో మాట్లాడుతూ.. అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని గాంధీ కుటుంబం న్యూయార్క్‌లో సోనియా గాంధీ చికిత్స కోసం ఉపయోగించిందని తెలిపారు. సోనియా చికిత్స కోసం సరైన సమయంలో.. గాంధీ కుటుంబానికి సాయం చేయడం ద్వారా తాను మంచి పని చేశానని సోనియా గాంధీ సన్నిహితుడు అహ్మద్‌ పటేల్‌ తనతో చెప్పారని కపూర్‌ వివరించాడు. అందుకే ఆయన పేరును పద్మభూషణ్‌ అవార్డుకు పరిశీలిస్తున్నట్టు చెప్పరన్నారు. పెయింటింగ్‌ కొనుగోలు చేయకపోతే.. అది తనపై, యెస్‌ బ్యాంక్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించినట్టు కపూర్‌ వివరించాడు. ఆ సమయంలో పెయింటింగ్‌ కొనడం తనకు అస్సలు ఇష్టం లేదని, దీన్ని ఒప్పించేందుకు మురళీ దేవరా మెస్సేజ్‌లు, కాల్స్‌ చేశాడని, అయినా తప్పించుకునేందుకు ప్రయత్నించానని, ఇల్లు, కార్యాలాయాలకు కూడా వచ్చినట్టు వెల్లడించాడు. అనుమానాస్పద లావాదేవీల ద్వారా.. కపూర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు కపిల్‌, ధీరజ్‌ రూ.5,050 కోట్ల నిధులను మళ్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది. మార్చి 2020లో అరెస్టు చేసినప్పటి నుంచి అతను జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement