ఒకరి మృతి.. ఆరుగురికి గాయాలు
పాత టెర్మినల్ లో నేటి ఉదయం ఘటన..
శిథిలాల కింద ధ్వంసమైన వాహనాలు
కొనసాగుతున్న సహయ కార్యక్రమాలు
పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. దీంతో రోడ్లన్ని కూడా జలయమయ్యాయి. ఈ క్రమంలోనే భారీగా వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. చాలా కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి.భారీ వర్షాలు కురుస్తుడండంతో ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్ లోని టెర్మినల్ 1 లో పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు ..వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వివరించారు.సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో పైకప్పు కింది పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
తాత్కాలికంగా సర్వీస్ లు నిలిపివేత
మరోవైపు టెర్మినల్-1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
దిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సంఘటనా స్థలంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా తీవ్రమైన ఘటన అని వ్యాఖ్యానించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. టెర్మినల్-1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
కూలింది పురాతన టెర్మినల్ …
”ఇక్కడ మీకు ఒక విషయం స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు తెల్లవారుజామున కూలినది పాత భవనంలోని పైభాగం. దానిని 2009లో ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం అవతలివైపు ఉంది” అని కేంద్ర మంత్రి చెప్పారు. కూలిన భాగంలోని కొన్ని బీమ్‌లు తుప్పుపట్టి ఉన్నాయని ప్రశ్నించగా.. ”దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుంది. దీనిపై తనిఖీ చేయమని విమానాశ్రయ అధికారులను ఆదేశించాం. మంత్రిత్వ శాఖ, డీజీసీఏ విడివిడిగా దర్యాప్తు చేస్తుంది” అని వెల్లడించారు.