Wednesday, November 20, 2024

Delhi | ఢిల్లీ లిక్కర్‌ కేసులో రామచంద్ర పిళ్లైకు కస్టడీ.. రిమాండ్‌ రిపోర్టులోకీలక విషయాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి పిలిపించిన అధికారులు, విచారణకు సహకరించడం లేదన్న కారణంతో అదే రోజు సాయంత్రం గం. 6.00కు అరెస్టు చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత పిళ్లైని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా మద్యం పాలసీ అవకతవకలు, అక్రమాల్లో పిళ్లై పాత్ర గురించి వివరించారు.

సీబీఐ మొదట నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌లో 14వ నిందితుడిగా ఉన్న పిళ్లైని అరెస్టు చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. జాప్యానికి కారణాలను వివరిస్తూ అరుణ్ రామచంద్రన్ పిళ్లై మద్యం పాలసీ రూపొందించే సమయం నుంచి పాలసీని అమలు చేయడం, ముడుపుల సొమ్మును ముందే చెల్లించడం, ఆ మేరకు లాభాలను వివిధ మార్గాల్లో పొందడం వరకు అన్ని చోట్లా ప్రమేయం, పాత్ర ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీగా ఉన్నానని వాంగ్మూలంలో పేర్కొన్నాడని, ఈ క్రమంలో మరింత లోతుగా ప్రశ్నించి, ఈ స్కాంతో సంబంధం ఉన్న మిగతావారి గురించి తెలుసుకోవాలని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

- Advertisement -

అందుకు వీలు కల్పిస్తూ పిళ్లైని 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. రిమాండ్ రిపోర్టులో ఇంకా అనేక విషయాలను, నగదు లావాదేవీలను ప్రస్తావించారు. అక్రమార్జన ద్వారా వచ్చిన డబ్బుతో పిళ్లై స్థిర,చరాస్తులను కొనుగోలు చేశాడని, వాటిని కూడా తాము అటాచ్ చేశామని చెప్పారు. ఈడీ విజ్ఞప్తి మేరకు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు.

రిమాండ్ రిపోర్టులో ఏముంది?

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో అరుణ్ రామచంద్రన్ పిళ్లై సౌత్ గ్రూప్ సిండికేట్ ఏర్పాటు నుంచి అడ్వాన్సుగా ముడుపులు చెల్లించడం, ఆ మేరకు అనుచిత లబ్దిని పొందడం వరకు అన్నింటిలో కీలక వ్యక్తిగా వ్యవహరించారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అరబిందో గ్రూపు ప్రమోటర్ శరత్ చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా మరికొందరితో కలిపి ఏర్పాటైన సౌత్ గ్రూపునకు పిళ్లైతో పాటు బోయినపల్లి అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించారని తెలిపింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, సౌత్ గ్రూపు వ్యక్తులకు మధ్య అవగాహన కుదర్చడంలో పిళ్లై కీలకంగా వ్యవహించారు.

ఇండో స్పిరిట్ సంస్థలో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉంది. మరో 32.5 శాతం వాటా ప్రేమ్ రాహుల్ పేరిట ఉంది. ఇక మిగిలిన 35 శాతం వాటా సమీర్ మహేంద్రు కలిగి ఉన్నారు. వీరిలో అరుణ్ రామచంద్రన్ పిళ్లై కవిత తరఫున వాటాదారుడిగా ఉండగా, మాగుంట కుటుంబం తరఫున ప్రేమ్ రాహుల్ కంపెనీలో వాటాదారుడిగా ఉన్నారని ఈడీ వివరించింది. ఈ విషయాన్ని పిళ్లైతో పాటు మరొకరు తమ వాంగ్మూలంలో అంగీకరించారని తెలిపింది.

అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు కలిసి మొత్తం సౌత్ గ్రూపు తరఫున మద్యం తయారీ, పంపిణీ, రిటైల్ వ్యాపారం వరకు సిండికేట్ రూపకల్పనలో భాగస్వాములని ఈడీ తెలిపింది. ఢిల్లీలో జరిగిన మొత్తం మద్యం వ్యాపారంలో 30 శాతం ఈ సౌత్ గ్రూపు నియంత్రించిందని వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ సంస్థలో పిళ్లై తన పెట్టుబడిగా రూ. 3.40 కోట్లు ఇచ్చినట్టుగా రికార్డుల్లో చూపారని, ఇందులో రూ. 1 కోటి తిరిగి పిళ్లైకి ఇవ్వాలని కవిత సూచించడంతో ఇచ్చారని పేర్కొంది.

సౌత్ గ్రూపు నుంచి విజయ్ నాయర్‌కు, తద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి అందిన ముడుపులకు ప్రతిఫలంగా ఇండో స్పిరిట్స్ సంస్థను మద్యం తయారీ సంస్థ ‘పెర్నో రికర్డ్’కు హోల్‌సేలర్‌గా నియమించారని వెల్లడించింది. తద్వారా వచ్చిన అక్రమ లబ్దిని ఇందులో పెట్టుబడిగా చూపారని అభియోగాలు మోపింది. మొత్తంగా మద్యం కుంభకోణం ద్వారా వచ్చే అక్రమార్జనను సక్రమంగా చూపడం కోసం ఇండో స్పిరిట్స్ సంస్థను ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్‌గా ఉపయోగించారని ఈడీ ఆరోపించింది.

ఇకపోతే సౌత్ సిండికేట్ ఏర్పాటు కోసం 2021 మేలో న్యూఢిల్లీలోని గౌర్ అపార్ట్‌మెంట్స్‌లో అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు కలిసి విజయ్ నాయర్‌తో చర్చలు జరిపారని ఈడీ వెల్లడించింది. ఒక సందర్భంలో శరత్ చంద్రారెడ్డికి చెందిన ఒక చార్టర్డ్ విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేశారని, ఆ విమానంలోనే అనేకాంశాల గురించి చర్చలు జరుపుకున్నారని ఈడీ తెలిపింది. రిటైల్ జోన్ల వ్యవహారం గురించి చర్చించుకోడానికి ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్లో చర్చలు జరిపారని, హోటల్ రికార్డులే ఇందుకు సాక్ష్యాలని వెల్లడించింది.

ఇచ్చిన ముడుపులకు ప్రతిఫలం రాబట్టేందుకు ఎలా వ్యవహరించాలన్న విషయాలను హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్ గదుల్లో చర్చించారని తెలిపింది. ఈ క్రమంలోనే హోల్‌సేల్ వ్యాపారి కమిషన్‌ను ఏకంగా 12 శాతానికి పెంచి, అందులో సగం (6శాతం) ముడుపులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి అందించేలా అందరూ కలిసి ఒప్పందం చేసుకున్నారని, సౌత్ గ్రూపు మాత్రం అడ్వాన్సుగా రూ. 100 ముందే ముడుపులు చెల్లించి, వాటిని అక్రమార్జన ద్వారా రాబట్టుకునే ప్రయత్నాలు చేసిందని ఈడీ వివరించింది. ఈ క్రమంలో గణాంకాలను పొందుపరిచింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement