Thursday, November 21, 2024

PM MODI: రాజ్యాంగ ర‌చ‌యిత‌ల‌కు రాముడి పాల‌నే స్ఫూర్తి.…ప్ర‌ధాని మోడీ

భారత రాజ్యాంగాన్ని రచించిన వారికి రాముడి పాలనే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిపాలన ఎలా ఉండాలనేది, ప్రజా సంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ధ పెట్టాలనే విషయాలకు రామ రాజ్యమే చక్కటి ఉదాహరణ అని అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రారంభంలో సీతారామ లక్ష్మణుల చిత్రాలకు రాజ్యాంగ నిర్మాతలు స్థలం కేటాయించారని గుర్తుచేశారు. తీవ్ర మేధోమథనం తర్వాతే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, మూడో భాగంలో పౌరుల ప్రాథమిక హక్కులను వివరించారని తెలిపారు.

అయోధ్యలో ఇటీవల జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని యావత్ దేశం ఓ పండుగలా జరుపుకుందని అన్నారు. దేశ విదేశాల్లోనూ రామ నామం మార్మోగిందని, వసుధైక కుటుంబం అనే భావనను ప్రజలు చాటారని వెల్లడించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రజలందరి మాటల్లో, మదిలో రాముడే ఉన్నాడని మోదీ చెప్పారు. దేశమంతా రామ జ్యోతి వెలిగించి దీపావళి జరుపుకుందన్నారు.

అమృత్ కాల్ లో జరుపుకున్న గణతంత్ర వేడుకల్లో మహిళలు తమ శక్తిని చాటారని మెచ్చుకున్నారు. పరేడ్ లో పాల్గొన్న 20 కంటింజెంట్స్ లో 11 కంటింజెంట్లు మహిళలేనని, ఎక్కువ భాగం మహిళలే నాయకత్వం వహించారని గుర్తుచేశారు. కళాకారులలోనూ పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారని చెప్పారు. మన సంప్రదాయ సంగీత వాయిద్యాలు శంఖం, నాదస్వరం వంటి వాటిని కూడా మహిళలే వాయించారని తెలిపారు.

- Advertisement -

మన దేశ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది 13 మంది మహిళా అథ్లెట్లను అర్జున అవార్డుతో సత్కరించినట్లు ప్రధాని వివరించారు. పద్మ అవార్డుల గురించి ప్రస్తావిస్తూ.. పద్మ అవార్డుల ప్రధానం విషయంలో చాలా మార్పులు జరిగాయని, ప్రస్తుతం ఇవి ప్రజల అవార్డులుగా మారాయని తెలిపారు. సమాజంలో మార్పు కోసం కృషి చేసిన వారికి ఈసారి పద్మ అవార్డులు దక్కాయని నరేంద్ర మోదీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement