అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వచ్చే ఏడాది జనవరి 1నాటికి పూర్తవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. బీజేపీ ‘జన్ విశ్వాస్ యాత్ర’ త్రిపురలో ప్రారంభించిన అమిత్ షా ఈ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లక్ష్యంగాగా అమిత్ షా విమర్శలు ఎక్కుపెట్టారు. ”రాహుల్ బాబా వినండి.. నేను రామ మందిరం తెరవడానికి తేదీలు ప్రకటిస్తున్నాను” అంటూ జనవరి 1, 2024 నాటికి అయోధ్య రామమందిరం సిద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద రామమందిర నిర్మాణం జరుగుతోంది. 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర వివాదానికి ముగింపు పలికింది.
దీంతో ఆగస్టు 5, 2020న రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చూస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రామ్ లల్లా గర్భగృహ దర్శనం జనవరి 2024 నుంచి ఉంటుందని ఇటీవల రామజన్మభూమి ట్రస్టు కూడా వెల్లడించింది. టెంపుల్ సైట్ వద్ద 550 మంది ఎల్ అండ్ టీ కార్మికులు పనిచేస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం వాడే పింక్ సాండ్‌స్టోన్ కోసం రాజస్థాన్‌లో మరో వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. పూర్తి టెంపుల్ కాంప్లెక్స్‌ను మాత్రం 2025లోగా పూర్తి చేయనున్నారు. విరాళాల రూపంలో రూ.3200 కోట్లు ఇప్పటికే ట్రస్టుకు అందాయి.
అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం బుధవారం అసోం రాజధాని గువహటి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. ఢిల్లి నుంచి ప్రత్యేక విమానంలో త్రిపుర రాజధాని అగర్తల వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం అగర్తలలో ల్యాండ్ కాలేక గువాహటిలో ల్యాండైంది. రాత్రికి గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో షా బస చేశారు. ఈ విషయాన్నిన అసోం సీఎం ట్వీట్ చేశారు.