రాజ్యసభకు పార్టీ అభ్యర్ధుల ఎంపిక కాంగ్రెస్‌లో కలకలాన్ని రేపింది.ఇప్పటికే అసమ్మతితో కునారిల్లుతున్న పార్టీలో మరింత సెగను రాజేసింది. రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్ధులుగా రాజీవ్ శుక్లా,అజయ్ మాకేన్,జై రామ్ రమేష్‌లను చత్తీస్‌గఢ్,హర్యానా, కర్నాటకల నుంచి ఎంపిక చేశారు. వీరు కాకుండా మరోపదిమందిని ఎంపిక చేశారు. వీరంతా ఏడు రాష్ట్రాలకు చెందిన వారు. జూన్ 10వ తేదీన రాజ్యసభలో 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.కాంగ్రెస్ అభ్యర్ధులను ఎంపిక చేసిన తీరుపై పార్టీలో గ్రూపు-23 గా వ్యవహరించబడుతున్న అసమ్మతివర్గం నాయకులు పలు ప్రశ్నలను సంధించారు.పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో రాజ్యసభ అభ్యర్ధులుగా బయటవారిని ఎంపిక చేశారని గ్రూపు-23 నాయకులు ఆరోపించారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం ను తమిళనాడు నుంచి రంజిత్ రంజన్‌ను చత్తీస్‌గఢ్ నుంచి,వివేక్ టంఖాని మధ్యప్రదేశ్ నుంచి ఎంపిక చేశారు.ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. పార్టీ మైనారిటీ విభాగం అధ్య క్షుడు ఇమ్రాన్ ప్రతాప్‌గిరిని మహారాష్ట్ర నుంచి పోటీకి ఎంపిక చేశారు.
దళితులకు,మహిళలకు టికెట్ల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉదయ్ పూర్ శిబిరంలో నిర్ణయాలు అమలుకు నోచుకోలేదని పలువురు నాయకులు పేర్కొంటున్నారు. దళిత నాయకురాలైన కుమారి షెల్జాని హర్యానా నుంచి ఎంపిక చేసి ఉండాల్సిందంటున్నారు. రాజస్థాన్ నుంచి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ముకు ల్‌వాస్నిక్, ప్రమోద్ తివారీలను ఎంపిక చేశారు. వీరు ముగ్గురూ రాజస్థాన్‌కి చెందినవారు కారు. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని ఎందుకు ఎంపిక చేయలేదో, బయటవారికి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారో పార్టీ అధిష్టానం సంజాయిషీ ఇవ్వాలని గ్రూపు-23 నాయకులు డిమాండ్ చేశారు.కాంగ్రెస్ చింతన్ శిబిరాన్ని రాజస్థాన్‌లో నిర్వహించారనీ, ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడినుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికలకే ఎందుకు అమలు జేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శాన్యం లోథా విమర్శించారు.కాగా కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అనే విషయం మరోసారి రుజువైందని బీజేపీ రాజస్థాన్ శాఖ అధ్యక్షుడు సతీష్ పూనియా వ్యాఖ్యానించారు. కాగా,రాజ్యసభకు పార్టీ టికెట్ దొరికే అవకాశం లేదని ముందే గ్రహించడం వల్లనే పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ పార్టీకి రాజీనామా చేసి.ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో పోటీ చేయడానికి కొద్ది రోజుల క్రితం ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.
నాకు అర్హత లేదా..?
ముంబై: రాజ్యసభ టికెట్ల ఎంపిక కార్యక్రమం కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి దారి తీసింది. నటి నగ్మా తన అసంతృప్తి స్వరాన్ని వినిపించారు. రాజ్య సభలో అడుగు పెట్టడానికి తనకు అర్హత లేదా అంటూ ఆమె ట్వీట్ చేశారు. రాజ్య సభకు ప్రకటించిన పదిమంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో నగ్మా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభకు కాంగ్రెస్ పదిమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో చాలామంది ప్రముఖ నేతల పేర్లు లేవు. రాజ్య సభకు సీట్లు ఆశించిన పలువురు సీనియర్ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. ఈసారి రాజ్య సభకు వెళ్లాలని ఎంతగానో ఎదురు చూసిన నగ్మా తన కోరిక నెరవేరకపోవడంతో నిరసన స్వరం పెంచారు. 18 ఏళ్ల క్రితం పార్టీలో చేరిన సమయంలో మహరాష్ట్ర నుంచి రాజ్య సభ సీటు ఇస్తానని సోనియా గాంధీ హామి ఇచ్చారని, కాని ఆ హామి నిలబెట్టుకోలేదని నగ్మా అన్నారు. కాగా నగ్మాట్వీట్‌తో కాంగ్రెస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..