Friday, November 22, 2024

పార్లమెంట్‌లో ధర్నాలు, దీక్షలకు నో.. సర్క్యులర్‌ జారీచేసిన రాజ్యసభ సెక్రటేరియట్‌..

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు, పార్లెమెంట్‌ ప్రాంగణంలో సభ్యులు ధర్నాలు, నిరసన దీక్షలు, ఆందోళనల వంటి కార్యక్రమాలు చేపట్టరాదని రాజ్యసభ సెక్రటేరియట్‌ శుక్రవారం సరికొత్త సర్క్యులర్‌ జారీ చేసింది. మరో రెండు రోజుల్లో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జారీ చేసిన ఈ సర్క్యులర్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. పార్లమెంట్‌లో అప్రజాస్వామ్య పదాలను వాడకూడదంటూ బుధవారంనాడు బుక్‌లెట్‌ విడుదల చేయడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ వేడి తగ్గకముందే రాజ్యసభ సెక్రటేరియట్‌ విడుదల చేయడంతో వివాదంపై ఆజ్యం పోసినట్టయింది. సభా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సమ్మె, నిరాహార దీక్షలు, మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా జరిగే చర్చల్లో అప్రజాస్వామిక పదాలను, భాషను ఉపయోగించరాదంటూ, ఏఏ పదాలు వాడకూడదో వివరిస్తూ జారీ చేసిన బుక్‌లెట్‌పై తీవ్ర విమర్శలు చెలరేగిన నేపథ్యంలో విపక్షాలు ఆందోళనలకు దిగకుండా కళ్లెం వేసేందుకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్నారు. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీమోడీ ఆ సర్క్యులర్‌లో సభ్యులను కోరారు. జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా వివాదాలు వేడి పుట్టిస్తున్నాయి.

విశ్వగురు తాజా దాడి – జైరాం రమేష్‌..

తాజా సర్క్యులర్‌పై కాంగ్రెస్‌ విరుచుకుపడింది. రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ జైరాం రమేష్‌ దీనిపై స్పందిస్తూ విశ్వగురు తాజా దాడి.. ధర్నా మానా హై… (డర్‌ నా మానాహై) అంటూ పరోక్షంగా ప్రధానిని ఉద్దేశిస్తూ వ్యంగ్యోక్తి విసిరారు. ట్విట్టర్‌లో శుక్రవారం ఈ పదబంధంతో ప్రభుత్వ చర్యను ఎత్తిచూపారు. గతంలో వివిధ సందర్భాలలో విపక్ష సభ్యులు పార్లమెంట్‌లోను, బయట ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. కాగా ఉభయసభల్లో కొన్ని పదాలను ఉచ్ఛరించరాదంటూ విడుదలైన బుక్‌లెట్‌పై విపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాము వ్యక్తం చేసే అభిపాయాలను తప్పుబట్టేందుకు, చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దేశ సంప్రదాయాలను బీజేపీ ఎలా ధ్వంసం చేస్తోందని ప్రజలు గమనించాలని విపక్షాలు కోరాయి. అయితే, ఏ పదాలపైనా నిషేధం విధించలేదని, అంశాలను బట్టి సభ్యులు గౌరవప్రదమైన భాషతో చర్చించాలని, సభా గౌరవాన్ని ఇనుమడింప చేసేలా వ్యవహరించాలని లోక్‌సభ స్పీకర్‌ గురువారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా ఏఏ పదాలను వాడకూడదో వివరిస్తూ విడుదలైన బుక్‌లెట్‌లో జువ్లూజీవి, బాల్‌ బుద్ది, కోవిడ్‌ స్పెడర్‌, స్నూప్‌గేట్‌, సిగ్గుసిగ్గు, వేధింపులు, వెన్నుపోటు, అవినీతి, డ్రామా, అహంకార ధోరణి, అసమర్ధ వంటివి ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement