ఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్‌ని రాజ్యసభ అభ్యర్థిగా ఆప్ నామినేట్ చేసింది. అలాగే ప్రస్తుతం జైలులో ఉన్న సంజయ్ సింగ్ తో పాటు ఎన్డీ గుప్తాలను పార్లమెంటు ఎగువ సభకు మరోసారి పంపాలని ఆప్ నిర్ణయించింది. కాగా, సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాల ప్రస్తుత పదవీకాలం ఈ నెల 27తో ముగియనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సంజయ్ గుప్తా జైలులో ఉన్నప్పటికీ అతడికే మరోసారి ఎగువ సభకు పంపాలని నిర్ణయించింది. ఇక ఆప్ అభ్యర్థన మేరకు సంజయ్ సింగ్ నామినేషన్ పత్రాలపై సంతకం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.ఇది ఇలా ఉంటే స్వాతి మాలీవాల్ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలను రెండవసారి రాజ్యసభ సభ్యులుగా కొనసాగించాలని ఆప్ నిర్ణయించింది.
రాజ్యసభలో 10 మంది అప్ సభ్యులు ..
రాజ్య సభలో రాఘవ్ చద్దా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఆప్‌కి ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు. పంజాబ్‌లో విజయం తర్వాత రాజ్యసభలో ఆప్ బలం గణనీయంగా పెరిగింది. అటు ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు జనవరి 3న ప్రారంభమయ్యాయి. జనవరి 19న పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లలో ఆప్‌కి 62 స్థానాలు ఉన్నందున అప్ ప్రతిపాదించిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.