పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి రసాభాసగానే సాగాయి. ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టిన అంశాలను ప్రభుత్వం అంగీకరించక పోవడంతో ఉభయసభల్లో ప్రతిష్టంభన నెలకొంది. సోమవారం కూడా ఇదే తంతు కొనసాగింది. అదానీ గ్రూపుపై వచ్చిన అభియోగాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయడంతోపాటు కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ బడ్జెట్ సమావేశాలను మార్చి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఎట్టకేలకు చైర్మన్ అంగీకరించారు.
దీన్ని వ్యతిరేకిస్తూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ఖర్గే చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. విపక్షాలు ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడంతో తొలుత సభను 11.50 నిమిషాల వరకు వాయిదా వేశారు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రసంగం నుంచి కొన్ని భాగాలను తొలగించడాన్ని కూడా విపక్షాలు తప్పుపట్టాయి. ఈ అంశంపైన కూడా సభలో ఆందోళన చేపట్టాయి. కొందరు ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లారు. రాఘవ చడ్డా, సంజయ్‌సింగ్, ఇమ్రాన్ ప్రతాప్‌గిరి, శక్తి సింగ్ గోహల్, సందీప్ పాఠక్, కుమార్ కేట్కర్‌లు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు.
కావాలనే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, సభను నడిపించే తీరు ఇది కాదు అని, ఇప్పటికే చాలా సమయాన్ని వధా చేశామని, హౌజ్‌లో ఇలాంటి గందరగోళం సరికాదు అని, ప్రజల ఆశయాలకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ తెలిపారు. వత్తిడిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను చైర్మెన్ ఖండించారు.