Wednesday, November 20, 2024

మూకదాడులకు ఆద్యుడు రాజీవ్.. రాహుల్ విమర్శలపై బీజేపీ

న్యూఢిల్లీ: దేశంలో మూకదాడులకు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆద్యుడదని, ఆ సంస్కృతికి జాతిపితవంటివాడని బీజేపీ ఎద్దేవా చేసింది. పంజాబ్ లో ఇటీవల జరిగిన మూకదాడుల సంఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా కాంగ్రెస్ ఎంపీ, రాజీవ్ తనయుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ హయాంలో సిక్కుల ఊచకోతను ఉదహరిస్తూ కేంద్రమంత్రి అశ్వని చౌబే తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఊచకోతను సమర్ధిస్తూ అప్పట్లో రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మూకదాడులకు రాజీవ్ గాంధీ ఆద్యుడని ఆరోపించారు. భారీ వటవృక్షం కూలినపుడు భూమి కంపిస్తుందంటూ సిక్కుల ఊచకోతను సమర్థిస్తూ రాజీవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. అసలు కాంగ్రెస్ హయాంలో దేశంలోని అనేక ప్రాంతాలలో జరిగిన ఊచకోతలు, ద్వేషపూరిత హత్యాకాండ సంఘటనలను ఆయన ఉదహరిస్తూ మూకదాడుల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు.

మరోవైపు బీజేపీ ఐటీవిభాగం నేత మాలవీయ కూడా ఇదే తరహా విమర్శలు గుప్పించారు. 1969-93 మధ్య అహ్మదాబాద్, జలగావ్, మొరాదాబాద్, నైల్లీ, భివాండి, ఢిల్లీ, భాగల్పూర్, హైదరాబాద్, కా్పూర్,ముంబైలలో వివిధ సందర్భాలలో జరిగిన సంఘటనలు వివరిస్తూ కాంగ్రెస్ పై ఎదురుదాడి చేశారు. నెహ్రూ-గాంధీ పరివార్ అధికారంలో ఉండగా కనీసం వందమంది మూకదాడులలో ప్రాణాలు కోల్పోయారని, ఇది చాలా చిన్న జాబితాని, 1984లో సిక్కులన ఊచకోత కోసి రక్తపుటేరులు పారించారని విమర్శించారు. పంజాబ్ స్వర్ణదేవాలయంలో జొరబడి అక్కడి పవిత్రగ్రంథాన్ని, మరో గురుద్వారాలో సిక్కుల పవిత్ర పతాకాన్ని తీసుకోబోయిన ఇద్దరిని కొట్టి చంపేసిన సంఘటనపై ట్విట్టర్ లో రాహుల్ స్పందించారు. 2014కుముందు మూకదాడి పదాన్ని వినలేదని, థాంక్యూ మోడీజీ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement