Friday, November 22, 2024

గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసిన రాజీవ్ గాంధీ : భ‌ట్టి విక్ర‌మార్క‌

ఉమ్మడి మహబూబ్ న‌గర్ బ్యూరో, ప్రభ న్యూస్ : దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేయగా సీఎం కేసీఆర్ గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గం, నవాబ్ పేట మండలం, రుక్కంపల్లి గ్రామంలోని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శిబిరం వద్ద భారత రత్న, దేశ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని 73, 74 అమెండ్మెంట్ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి కేంద్రం నుంచి గ్రామపంచాయతీలకు నేరుగా నిధులను పంపించే వ్యవస్థను ఆనాటి ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన విషయాన్ని దేశంలో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థలు గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

సీఎం కేసీఆర్ గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడని అన్నారు. గ్రామాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు నేరుగా వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నాడ న్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి రాష్ట్ర పాలన తీసుకువెళ్లారని విమర్శించారు. ప్రధాని మోడీ గ్రామ స్వరాజ్యం, ఫెడరలిజంకు తూట్లు పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఉండే అధికారులను సైతం నిర్వీర్యం చేస్తున్నాడని వివరించారు. దేశ ప్రజాస్వామ్యం, గ్రామ స్వరాజ్యాన్ని కాపాడడం కోసం దేశంలో ఉన్న యువత పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. దేశ పాలనలో యువతను భాగస్వామ్యం చేయడానికి 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలర్పించిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారి మార్గం, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేద్దామని కోరారు.

టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజలను ఇరవై ఒక్క శతాబ్దంలోకి తీసుకువెళ్లిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. ఐటీ రంగంలో దేశం ప్రపంచంతో పోటీ పడేలా రాజీవ్ గాంధీ చేశారని అన్నారు. రాజీవ్ గాంధీ అకాల మరణం ఈ దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాజీవ్ గాంధీ ఆశయాలు, ఆలోచనలు ముందుకు తీసుకెళ్లి రాజీవ్ కలలను నిజం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని వివరించారు. దేశంలో గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని వెల్లడించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ చైర్మన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement