నెల్సన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. రజనీకాంత్ కి ఇది 169వ చిత్రం.అన్నాత్తే తరువాత ఈయన నటించనున్న తాజా చిత్రం జైలర్. రజనీకాంత్ చిత్రాలు అంటేనే భారీ తారాగణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటాయని.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజా చిత్రానికి మరింత భారీ విలువలు సంతరించుకోనున్నాయి. అందాల భామ ఐశ్వర్యరాయ్ ఎందిరన్ తరువాత ఈ చిత్రంలో మరోసారి రజనీకాంత్‌తో జోడీ కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
నటి ప్రియాంక మోహన్ మరో నాయకిగా, రమ్యకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, హీరో శివకార్తికేయన్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. కాగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. జైలులోని ఖైదీలు నేపథ్యంలో రూపొందబోతున్నట్లు సమాచారం. జూలైలో షూటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే జూలై నాటికి రజనీకాంత్ నటుడిగా 47ఏళ్ల మైలు రాయిని చేరుకోనున్నా రు. దీంతో తాజా చిత్రానికి సంబంధించి ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయనున్నారు.