భారత షట్లర్ ప్రియాంషు రజావత్ ఓర్లీన్స్ సూపర్‌లో టైటిల్ విజేతగా నిలిచాడు. డెన్మార్క్ ప్లేయర్‌పై చారిత్రక విజయం సాధించాడు. తన కెరీర్‌లో తొలి బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్‌ను గెలుచుకున్నాడు. రజావత్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో తనకంటే మెరుగైన ర్యాంక్ ఆటగాడు మాగ్నస్ జొహన్నెసెన్‌ను ఖంగుతినిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్ పోరులో 49వ ర్యాంక్ ఆటగాడైన జొహన్నెసెన్‌తో రజావత్ 68 నిముషాలపాటు హోరాహోరీగా తలపడ్డాడు. చివరకు 21-15, 19-21, 21-16 స్కోరుతో విజయాన్ని నమోదుచేశాడు.
21 ఏళ్ల మధ్యప్రదేశ్ షట్లర్ గతేడాది థామస్ కప్‌లోనూ భారత తరఫున చారిత్రక విజయాన్ని సాధించి ఉజ్వల భవిష్యత్ కలిగిన వర్ధమాన ప్లేయర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. కాగా, ఓర్లీన్ టోర్నమెంట్ ఆసాంతం ప్రియాన్షు అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్ చేరేక్రమంలో ప్రపంచ నంబర్ వన్ సీడ్ జపాన్ షట్లర్ కెంటా నిషిమోటోను సైతం ఖంగుతినిపించాడు. ఈ ఏడాది బ్యాడ్మింటన్‌లో పురుషుల విభాగంలో భారత్‌కు లభించిన మొదటి సింగిల్స్ టైటిల్ ఇదే కావడం గమనార్హం. ఇంతకు ముందు స్విస్ ఓపెన్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి డబుల్స్ విభాగంలో టిటైల్ సాధించారు.