ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సంక్షోభంలో పడింది. ఆటగాళ్లు అప్పు కావాలి అంటూ ఇతర ఫ్రాంచైజీలను అడుగుతోంది. ప్రస్తుతం ఆ జట్టు నుంచి నలుగురు విదేశీ ఆటగాళ్లు లీగ్ వదిలి వెళ్లిపోయారు. ఈ కొరతతో సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఉన్న జట్టు గందరగోళంలో పడింది.
ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తమ పేసర్ ఆండ్రూ టై వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు ప్రకటించాడు. అంతకంటే ఓ నాలుగు రోజుల ముందే లియామ్ లివింగ్ స్టోన్ బబుల్ ఫ్యాటిగ్ తో ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఇవి చాలదన్నట్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ కూడా గాయాలతో జట్టుకు దూరమవడం ఫ్రాంచైజీకు గట్టి దెబ్బ తగిలింది. ఇంకా ఆ జట్టు 9 లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. జోస్ బట్లర్, క్రిస్ మోరిస్, డేవిడ్ మిల్లర్, ముస్తఫిజుర్ రెహ్మాన్ మాత్రమే జట్టుతో ఉన్నారు.
ఈ సీజన్లో ఇతర ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లను జట్లు అరువు తెచ్చుకునే ప్రక్రియ సోమవారం మొదలైంది. లీగ్ దశ ముగిసే వరకూ కొనసాగుతోంది. ఈ సీజన్లో రెండు కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిని ఇతర జట్లు అరువు తీసుకోవచ్చు. అతడిపై ఉండే కండీషన్ ఏంటంటే.. సొంత జట్టుతో జరిగే మ్యాచ్‌లో మాత్రం ఆడకూడదు. ఇప్పటివరకూ లీగ్‌లో 5 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది.