ఒకరు కాదు ఇద్దరు కాదు 32 మందిని పెళ్ళి చేసుకుని వాళ్ళ బంగారు ఆభరణాలతో పరారైన నిత్యపెళ్లి కూతురు అనితను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు… 33 వ పెళ్లికి సిద్దమవుతున్న తరుణంలో ఢిల్లీ పోలీసులు ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు.. రాజస్థాన్ కు చెందిన 28 ఏళ్ల మహిళ అనిత పెద్దలతో పెళ్ళి కుదిర్చినట్లు మ్యాచ్ ఫిక్స్ చేసుకోవడం.
ఎక్కడా ఫోటోల్లో, వీడియో ముఖం కనిపించకుండా వరుడి వెంట వెళ్ళిపోవడం. ఆ తరువాత వారి ఇంట్లో దొరకిందంతా దోచుకుని పరారైపోవడం, కొంత కాలానికి మరో పెళ్ళికి ప్లాన్ వేయడం, మరో బకరాను బలి చేయడం ఇదీ ఆమె స్టయిల్..
కానీ, చివరికి ఆమె నాటకం బయటపడింది. ఢిల్లీ పోలీసులకు పట్టుబడింది. అనిత చేసుకున్న పెళ్లిళ్లన్నీ పెద్దలు కుదిర్చినవే.పెళ్లి సంబంధాలు మాట్లాడే సమయం నుండి ముందు జాగ్రత్తలు తీసుకొనేది. కొత్త కొత్త పేర్లతో వరుడి కుటుంబ సభ్యులను ఆమె మోసం చేసేది. తన పోలికలను గుర్తించకుండా కూడ జాగ్రత్తలు తీసుకొనేది.
పెళ్లి తర్వాత సంప్రదాయం ప్రకారంగా నిర్వహించే కార్యక్రమాలకు రకరకాల కారణాలను చూపి దూరంగా ఉండేది. అదే సమయంలో వరుడి ఇంట్లో విలువైన వస్తువులను దోచుకొనేందుకు మార్గాలను అన్వేషించేది. సమయం చూసి వరుడి ఇంట్లో విలువైన వస్తువులతో ఉడాయించేది.
రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్ వారా జిల్లాలోని సంగ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తితో వివాహం చేసుకొని అనిత జంప్ అయింది. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరకు అనిత ఢిల్లీలో పోలీసులకు చిక్కింది. ఈ పెళ్లిళ్ల వెనుక అనితకు ఎవరెవరు సహకరించారనే విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.