దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా విజృంభిస్తోంది. ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుందని, పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. త్వరలోనే థర్డ్ వేవ్ ముంపు పొంచి ఉందని, చిన్నారులపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో రెండు రోజుల్లో సుమారు 600 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
దౌసా, దుంగార్‌పూర్ జిల్లాలోని 600 మంది చిన్నారులకు అనారోగ్యం పాలవగా.. వారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా రాజస్థాన్‌లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది. అటు పిల్లలను కరోనా నుంచి రక్షించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) తెలిపింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని NCPCR అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్ లేఖ రాశారు. నేషనల్ ఎమర్జెన్సీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (నెట్స్)ను పునర్ వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నవజాత శిశువులు, పిల్లల కోసం ప్రత్యేకంగా సేవలందించేందుకు, అంబులెన్సులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఆరోగ్యమంత్రిత్వశాఖను కోరారు.
తల్లిదండ్రులతోనే పిల్లలు వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారని రాజస్థాన్ ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు వారి తల్లిదండ్రుల నుంచే చిన్నారులకు వైరస్ సోకినట్లు తేలింది. అయితే గత పది రోజుల్లో 250 మందికి పైగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారని మరో అధికారి చెప్పారు.