దేశంలో కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటు అన్నదాతలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం రైతులకు చేయూతనిచ్చేలా ఓ వినూత్న పథకం తీసుకొచ్చింది. కిసాన్ మిత్ర యోజన పేరుతో కర్షకులకు నెలకు రూ.1000 అందించే పథకాన్ని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆదివారం ప్రారంభించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంవత్సరానికి గరిష్ఠంగా రూ.12వేలు అందిస్తామని చెప్పారు. కిసాన్ మిత్ర యోజన పేరుతో ప్రారంభమైన ఈ పథకానికి ఏటా రూ.1,450 కోట్లు ఖర్చు చేయనున్నారు.
అయితే రైతులకు మరింత సాయం అందించాలని, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో అన్నదాతలకు నెలకు రూ.వెయ్యి ఏ మాత్రం సరిపోవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ అన్నదాతలను ఆదుకునేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందువల్ల ప్రభుత్వాలు రైతన్నల సంక్షేమంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి: 10 మేకపోతులు.. టన్నుల కొద్దీ చేపలు.. యానాంలో ఆషాఢం సారె