విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ పద్మావతి సహిత భూదేవి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం టీటీడీ విలీనం చేసుకుంది. ఇప్పటిదాకా ఆలయాన్ని నిర్వహిస్తున్న బాలాజీ ట్రస్టు సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.30 గంటల మధ్య టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి ఆలయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఇకమీదట ఈ ఆలయంలో టీటీడీ పద్ధతి ప్రకారం సేవలన్నీ నిర్వహిస్తారు. అంతే కాకుండా ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అభివద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీ గ్రంథి మల్లిఖార్జునరావు నిర్మించిన ఈ ఆలయాన్ని బాలాజీ ట్రస్టు పర్యవేక్షణలో, జీఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఆలయాన్ని టీటీడీ నిర్వహించాలని శ్రీ గ్రంథి మల్లిఖార్జునరావు కోరారని ఈవో తెలిపారు. టీటీడీ పాలకమండలి ఇందుకు ఆమోదించడంతో ఆలయాన్ని విలీనం చేసుకున్నామని అన్నారు.
పాంచరాత్ర ఆగమయుక్తంగా ఆలయ నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయాన్ని మరింత అభివద్ది పరిచేందుకు జీఎంఆర్తోపాటు రాజాం ప్రజలు, దాతల సహకారం తీసుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 60 ఆలయాలు ఉన్నాయని ఈవో తెలిపారు. విశాఖపట్నం డిప్యూటీ ఈవో పరిధిలోకి రాజాం ఆలయం వస్తుందని చెప్పారు. తిరుమల కు నడక దారిలో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా సమయంలో మూడు నెలలకు ఒకసారి ఆన్లైన్లో దర్శనం టికెట్లు విడుదల చేసేవారమని చెప్పారు.
ఇప్పుడు కరోనా ఇబ్బందులు లేనందువల్ల గతంలో లాగానే నెలకోసారి ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. టీటీడీ కల్యాణమండపాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందించిన ఆయన స్పందిస్తూ, కొన్నిచోట్ల కల్యాణమండపాలు శిథిలావస్థకు చేరుకున్నాయనీ, మరి కొన్నింటికి ఆదరణ లేదని అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని అలాంటి కల్యాణ మండపాల నిర్వహణ మాత్రమే కాంట్రాక్ట్ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చామన్నారు.
ఇదీ ఆలయ చరిత్ర..
రాజాం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డులో 3.5 ఎకరాల్లో రూ. 3 కోట్ల వ్యయంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజియర్ స్వామి పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు. 2015లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి 2018 సంవత్సరంలో ప్రతిష్ట నిర్వహించారు. అప్పటి నుంచి ట్రస్టు ద్వారా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రంధి ఈశ్వరరావు, గ్రంధి నీలాచలం, గ్రంధి భాస్కరరావు, కొల్లూరు వెంకట నాగేశ్వరరావు, జీఎంఆర్ కుటుంబసభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.