న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పార్టీ అధిష్టానం చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఢిల్లీలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో టీ-కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై సమగ్రంగా చర్చించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం టాగోర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. అరగంటకు పైగా సాగిన ఈ భేటీ అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పార్టీని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాత్మక కార్యక్రమాల గురించి చర్చించామని తెలిపారు. ఈ క్రమంలో మునుగోడు వ్యవహారంపై లోతుగా చర్చ జరిగినట్టు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా మునుగోడు అంశంపై తాము యాక్షన్ ప్లాన్ తయారుచేశామని, రెండు మూడు రోజుల్లో దాన్ని ప్రకటిస్తామని అన్నారు. అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వెళ్లిపోయారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానం పెద్దలను సంప్రదించగా, 24 గంటల్లో ఒక నిర్ణయం వెలువడుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ నేత చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో ఇంతకు ముందు జరిగిన సమావేశంలో బుజ్జగించే ధోరణిలో వ్యవహరించిన నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి మనస్తాపానికి గురైన అంశాలపై చర్చించి పార్టీలోనే కొనసాగేలా చూస్తామని భట్టి విక్రమార్క అన్నారు. అన్నట్టుగానే పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డితో మంతనాలు సాగించారు. పార్టీ మారే అంశంపై ఆయన వైఖరిని మరోసారి అడిగి తెలుసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డితో కూడా మాట్లాడించి, పార్టీలోనే కొనసాగేలా ఒప్పించేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది.
సోనియాదే తుది నిర్ణయం..
మొత్తంగా బుజ్జిగింపు ప్రయత్నాలేవీ సఫలం కాలేదని, రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడడం ఖాయమని టీ-కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్‌కు వెల్లడించినట్టు తెలిసింది. దీంతో సోమవారం నాటి భేటీలో వీటన్నింటిపై చర్చించి, ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే ఆ నిర్ణయాన్ని అమలుచేసే ముందు అధినేత్రి సోనియా గాంధీతో చర్చించి, ఆమె ఆమోదముద్ర కోసం రెండు మూడు రోజుల విరామం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. ఇదివరకే షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణలు తీసుకున్న రాష్ట్ర నాయకత్వం, ఇకపై మరిన్ని అవకాశాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నందున, క్రమశిక్షణాపరమైన చర్యల్లో భాగంగా తొలుత సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.