తన స్వలాభం కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో సుమారు 97 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఉప ఎన్నికలలో బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలలో ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో…ఏం అభివృద్ధి చేశారో తెలపాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ నేతలకు కులాలు, మతాలు గుర్తుకొస్తాయని ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులు ఏమైనా చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అన్న విశ్వాసంతో ప్రజలున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బన్సీలాల్ పేటలో సుమారు రూ.97లక్షల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనుల వద్దకు నడుచుకుంటూ వెళుతూ మద్య మద్యలో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఎలక్ట్రికల్ డీఈ శ్రీధర్, హార్టికల్చర్ అధికారి రాఘవేందర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోపర్, నాయకులు రాజు, ప్రేం, లక్ష్మీపతి, అబ్బాస్, రజాక్, కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.