Wednesday, November 20, 2024

యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లో తెలుగోడికి అత్యున్నత పదవి..

భారత సంతతికి చెందిన వ్యక్తులకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కటం ఇది తొలిసారి కాదు..ఈ నేపథ్యంలో మరో భారతీయ అమెరికన్‌కు అరుదైన ఖ్యాతి లభించింది. పైగా సదరు వ్యక్తి తెలుగువాడు కావడం విశేషం. అమెరికా ఎయిర్‌పోర్స్‌లో బ్రిగేడియర్‌ జనరల్‌ గ్రేడ్‌ పదవికి తెలుగు వాడైన రాజాచారిని అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారు. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. 45ఏళ్ల రాజాచారి ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో కర్నల్‌ హోదాలో కొనసాగుతున్నారు. గత ఏడాది అంతరిక్షయానం కూడా పూర్తి చేసిన రాజాచారి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో వ్యోమగామిగా, క్రూ-3 కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -

రాజాచారి తండ్రి శ్రీనివాస్‌ వి. చారి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. ఉన్నత విద్య చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికన్‌ అయిన పెగ్గీ ఎగ్బర్ట్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 1977లో రాజాచారి జన్మించారు. రాజాచారి స్కాన్సిస్‌లోని మిల్వాకీలో ప్రాథమిక విద్యను, యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఆస్ట్రోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేశారు. మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్‌, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. అమెరికా నావల్‌ టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌లోనూ విద్యనభ్యసించిన రాజాచారి, 2017లో నాసా ఆస్ట్రోనాట్‌ క్యాండిడెట్‌ క్లాస్‌కు ఎంపికయ్యారు. 2021లో నాసా, స్పేస్‌ఎక్స్‌ జాయింట్‌గా ప్రయోగించిన క్రూ-3 మిషన్‌లో రాజాచారి సభ్యుడుగా ఉన్నారు.

ఫాల్కన్‌ 9 రాకెట్‌లో 4గురు వ్యోమాగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలు దేరిన మిషన్‌లో రాజాచారి కమాండర్‌ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. కొన్ని నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు పూర్తి చేసుకుని గత ఏడాది మే నెలలో ఫాల్కన్‌ 9 భూమిపైకి తిరిగి వచ్చింది. చంద్రునిపై అన్వేషణ కొనసాగించేందుకు చేపడుతున్న ప్రతిష్టాత్మక ఆర్టెమిస్‌ మిషన్‌ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. అమెరికా ఎయిర్‌పోర్స్‌లో బ్రిగేడియర్‌ జనరల్‌ గ్రేడ్‌ పదవికి రాజాచారి నామినేషన్‌ను సెనేట్‌ ఆమోదించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement