Friday, November 22, 2024

భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు.. నియంత్ర‌ణ‌లో విఫ‌లమైన అధికార యంత్రాంగం..

ప్రభన్యూస్ : కొండెక్కిన పప్పులు… భగ్గుమంటున్న కూరగాయలు… మరుగుతున్న నూనెలు… ఇలా మార్కెట్‌లో ధరల దరువుకు చుక్కలను తాకుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్ల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో లబోదిబోమంటున్నారు. ఏ సరుకు ధర చూసినా భగ్గుమంటుతోంది. రెక్కాడితే కాని డొక్క నిండని సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో జనం విలవిలలాడుతున్నారు. అసలే ఉపాధి లేక అల్లాడుతున్న పేద ప్రజల పై ఈ ధరల పెరుగుదల పెనుభారాన్ని మోపుతోంది. రోజూ మనం ఇంటింటా నిత్యం వినియోగించే పప్పు, బియ్యం, ఉల్లి, కూరగాయలు, నూనెల రేట్ల ధరలు సైతం ఆకాశనంటే స్థాయిలో దూసుకెళుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే నిత్యావసరాల ధరలు రెట్టింపు కావడంతో మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సన్‌ఫ్లవర్‌ నూనె లీటరు రూ.190కు పెరిగింది. మిగిలిన వంట నూనెలు వందకు పైగా ధరలు పెరగడంతో పేదలు, సామాన్య ప్రజల బతుకు జీవనం కష్టంగా మారింది. ఉల్లి లేనిదే కూర రుచించదు. అయితే దీని ధర కొండెక్కడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. రిటైల్‌ బహిరంగ మార్కెట్‌లో ఉల్లి రూ.40 నుంచి రూ.50 వరకూ పలుకుతోంది. గత ఏడాదిలో ఇదే సమయంలో కందిప‌ప్పు ధర రూ. 90 నుంచి రూ.95 ఉండేది. ప్రస్తుతం రూ.150కి ఎగబాకింది. ఒక కిలో మినపప్పు రూ.160కు చేరింది. మార్కెట్‌లో బియ్యం ధరలకు కూడా రెక్కలొచ్చాయి. రెండు నెలల క్రితం వరకు సోనా మసూరి ప్రథమ శ్రేణి కొత్త బియ్యం 25 కేజీలు రూ. 12.50లు ఉండగా, ప్రస్తుతం రూ.1400కు చేరింది. మార్కెట్‌లో నిత్యావసర ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ ధరలు రెట్టింపు కావడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మరో వైపు రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లతో వాహనదారులు సైతం ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా..వాటి ప్రభావం నిత్యావసర వస్తువుల రేట్లపై పడుతోందని, ధరల పెరుగుదలకు కారణం ఇదేనని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement