పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(శనివారం) మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు జులై 18న ప్రారంభం కానున్న నేపథ్యంలో వారికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం ప్రకారం.. పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించిన అనేక కీలక అంశాలను లేవనెత్తడానికి, ఉభయ సభలలో ఒక వ్యూహాన్ని అనుసరించడానికి ఎంపీలకు కేసీఆర్ ఆదేశాలు ఇవ్వనున్నారు.
తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో పోరాడాలని, ఈ సెషన్లో నిరసనలు తెలియజేయాలని ఎంపీలకు సీఎం ఆదేశాలివ్వనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు ఆర్థిక అడ్డంకులు సృష్టిస్తున్న విషయమ్మీద పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని.. రైతులు, మిల్లర్ల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా సమస్యను సృష్టించిన తీరుమీద.. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న విధానాలను లేవనెత్తాలని, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమవడాన్ని గమనించిన కేసీఆర్ ఈ అంశాన్ని సభలో లేవనెత్తాలని సూచించే అవకాశం ఉంది.
అంతేకాకుండా.. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు.. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల ఎంపీలను కూడా టీఆర్ఎస్తో చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచించనున్నట్టు సమాచారం.