Friday, November 22, 2024

Big Story | తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. బోర్లు, బావుల కింద దెబ్బతింటున్న పంటలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతూ వానాకాలం సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జులై రెండోవారం గడిచిపోయినా ఇప్పటి వరకు తేలికపాటి తుప్పురు వానలే తప్ప భారీ వర్షాలు కురవలేదు. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురవకపోవడంతో చెరువులు, బావులు, కుంటలు, వాగుల్లోకి ఇంత వరకు చుక్కనీరు కూడాచేరలేదు. ఫలితం గా భూగర్భ జల మట్టం వేగంగా తగ్గిపోతోంది.

భారీ వర్షాలు కురిసి నీటి వనరుల్లోకి నీరు చేరితేనే భూగర్భ జలాలు వృద్ధి చెందిన సాగు ఊపందుకోనుంది. గతేడాది వానాకాలం ఇదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో చెరువులు, వాగుల్లోకి భారీగా నీరు చేరింది. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 200 ఫీట్ల వరకు తవ్విన బోరు బావులు కూడా పుష్కలంగా నీటిని తోడిపోశాయి. నాలుగైదు కోలల (గజాలు) లోతు ఉన్న బావులు కూడా కనీసం నాలుగు గంటలపాటు పొలానికి నీరు అందించాయి.

అయితే ఈసారి వర్షాలు కురవకపోవడంతో ఫుల్‌ సక్సెస్‌ అయిన, 300ఫీట్ల వరకు పైపులు దించినా బోర్లు కూడా కనీసం 20 నిమిషాలు కూడా నీటిని ఎత్తిపోయడం లేదని రైతులు వాపోతున్నారు. గతేడాది ఇదేసమయంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో బావుల్లో ప్రతి రోజూ రెండు మూడు గజాల నీ రు ఊరేది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజంతా వేచి చూసినా రెండు, మూడు అడుగులు మించి నీటి ఊట రావడం లేదని రైతులు వాపోతున్నారు.

- Advertisement -

బోర్లు, బావుల కింద వెలవెలబోతున్న సాగు…

వరి సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావం వర్షాభావ పరిస్థితులు ముఖ్యంగా వరిసాగుపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగాఉందో ఊహించుకోవచ్చు. భారీ వర్షాలు కురిస్తే రాష్ట్రంలో కనీసం 50లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఇందులో ఎక్కువగా బోర్లు, బావుల కింద సాగయ్యే వరినే అధికం. అయితే ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో వానాకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా వర్షాలు కురవక బోర్లు, బావుల్లో బూగర్భ జలాలు అడుగంటిపోయాయి.

వర్షాలు కురవకపోవడంతోపాటు కాల్వల్లోనూ నీరును వదలకపోవడంతో అనేక చోట్ల ఇప్పటికీ వరినాట్లు ప్రారంభం కాలేదు. ఈ నెలాఖరునాటికి ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారి వానాకాలం వరిసాగుపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో నారు మళ్లకే నీరు లేని దుస్థితి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నెలకొంది. భారీ వర్షాలు కురుస్తేనే వరినాట్లు నిర్ణీత లక్ష్యాన్ని చేరనున్నాయి.

వరిసాగులో జులై నెల అత్యంత కీలకం. ఈ నెలలోనే దాదాపు 90శాతం వరినాట్లు పూర్తి కావాల్సి ఉంది. జుడై రెండో వారం గడుస్తున్నా గట్టి వర్షం ఒక్కటి కూడా కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఆశించినస్థాయిలో కురిస్తే దాదాపు 50లక్షల ఎకరాల్లో వరినాట్లు పడాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ కనీసం 20లక్షల ఎకరాల్లోనూ పడలేదంటే పరిస్థితిఎంత ప్రమాదకరంగాఉందో అర్థం చేసుకోవచ్చు.

20లక్షల ఎకరాలు కూడా దాటని పత్తి సాగు…

ఇక ఆరుతడి పంటల్లో ప్రధానమైన పత్తి పంటసాగు కూడా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అడపాదడప కురిసన చినుకులకు రైతులు పత్తి విత్తనాలను నాటారు. అయతే భారీ వర్షాలు కురవకపోవడంతో పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి. వర్షాలు కురవకపోగా ఎండలు దంచికొడుతుండడంతో ఆలస్యంగా విత్తని పత్తి విత్తనాలు మొలకెత్తడం లేదు. భూమిలోనే గింజలు పొట్లిపోతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా దాదపు 10లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవారంపాటు వర్షాలు కురవకపోతే పత్తి విత్తనాలను మళ్లి విత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పత్తి విత్తేందుకు జులై నెలాఖరు వరకు అదను సహకరిస్తుంది.

ఆ తర్వాత పత్తి విత్తనాలు వేసినా చీడపీడలు ఆశించి, మొక్క ఎదుగుదల లోపించి కాతపూత రాక దిగుబడి తగ్గి నష్టాలే మిగులుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 65లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసినా అందులో సగం కూడా అంటే 20లక్షల ఎకరాల్లో కూడా పత్తి విత్తనాలు మొలకెత్తలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement