Thursday, September 19, 2024

TG | మరో రెండు రోజులపాటు వర్షాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపపనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

రాష్ట్రంలోని నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.

ఈ మేరకు వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లోఅలర్ట్‌ జారీ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యాహ్నాం కాస్త ఎండ కాసినా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కాగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కొమురంభీం, మహబూబాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కొమురంభీం జిల్లా తిర్యాలలో 5.65 సెం.మీ, మహబూబాబాద్‌ జిల్లా గార్లెలో 5.47 సెం.మీ, జగిత్యాల జిల్లా పెగడపల్లిలో 4.95 సెం.మీ, సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 4.26 సెం.మీ, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 4.58 సెం.మీ, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 4.02 సెం.మీ, యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూర్‌-ఎంలో 3.85 సెం.మీ, మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో 3.67 సెం.మీ, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 3.62 సెం.మీ, సిద్దిపేట జిల్లా నంగనూర్‌లో 3.42 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement