Friday, November 22, 2024

రెండు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. బుధవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంగ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కురుస్తాయని వివరించింది. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని వివరించింది. వర్ష హెచ్చరికలు కొనసాగుతున్నా… రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి.

- Advertisement -

గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 41.3, భద్రాచాలంలో 39 డిగ్రీలు, హకీంపేటలో 37.6 డిగ్రీలు, దుండిగల్‌లో 37.9 డిగ్రీలు, హన్మకొండలో 40 డిగ్రీలు, హైదరాబాద్‌లో 37.2 డిగ్రీలు, ఖమ్మంలో 39.6 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 37.2 డిగ్రీలు, మెదక్‌లో 39.2 డిగ్రీలు, నల్గొండలో 41 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.7 డిగ్రీలు, రామగుండంలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement