Friday, November 22, 2024

మూడు రోజులపాటు వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆసీఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, సిద్ధిపేట, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్లతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది.

బుధవారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అక్కడక్కడా వానలు పడే సూచనలున్నాయని ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను వల్లే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈ నెల 6న బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని దీని ప్రభావంతో దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరయర్‌ కర్ణాటక, మరఠ్వాడా వరకు ద్రోణి కేంద్రీకృతమై ఉందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగానే ఉంటాయని తెలిపింది.

హైదరాబాద్‌కు ఆరు రోజుల వర్ష హెచ్చరిక….

హైదరాబాద్‌లో రాబోయే ఆరు రోజులపాటు అకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మే 2, 3 తేదీల్లో నగరంలో సాధారణ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతాయని పేర్కొంది. 4, 5 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. 6 నుంచి 8తేదీ వరకు సాయంత్రం లేదా రాత్రి వర్షం కురుస్తుందని ప్రకటించింది. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయని పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement