Saturday, November 23, 2024

మూడు రోజులుగా వర్షాలు.. మెట్టపంటలకు జీవం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో సాగుపై మళ్లి ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఆగస్టు నెలంతా వర్షాలు ముఖం చాటేయడంతో తెలంగాణలో సాగు సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం నెలకొంది. ముఖ్యంగా మెట్ట పంటలు పత్తి, కంది, మొక్కజొన్న, మిర్చి సాగు చేసిన రైతులు ఇక పంటలపై ఆశలు వదిలేసుకున్నారు. ఈ తరుణంలో సెప్టెంబరులో మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాడిపోయి తలలువాల్చిన ఆరుతడి, మెట్ట పంటలు మళ్లి జీవం పోసుకున్నాయి. దీంతో రైతులు మళ్లి పొలంబాట పట్టారు. ఓ దశలో భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో వరిసాగు కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ఎండిపోతున్న పంటలను ఎలా రక్షించాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్న తరుణంలో ఎట్టకేలకు వరుణుడు కరునించడంతో పత్తి, వరి, కంది, తదితర పంటలు ఊపిరి పోసుకున్నాయి. వానాకాలం సాగు ఆరంభంలో ఆశాజనకంగా వర్షాలు కురవడంతో రైతులు పత్తి పంటను రికార్డు స్థాయిలో సాగుచేశారు. జూన్‌లో ఆలస్యంగా, జూలై నెల చివరల్లో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో వర్షాభావ ప రిస్థితుల్లోనూ రైతులు 57.71లక్షల ఎకరాల్లో వరి, 44.73లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. వరితోపాటు మరో 5.28లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, కందులు సాగయ్యాయి. మరో 4లక్షల ఎకరాల దాకా మిర్చిని సాగు చేశారు.

- Advertisement -

అయితే ఈ పంటలకు నీటి తడి కీలకమైన ఆగస్టులో వర్షాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీంతో పత్తి పంట ఆశించినస్థాయిలో ఎదగలేదు. అక్కడక్కాడా పూతకు వచ్చినా వర్షాభావ పరిస్థితులతో పూత (గూడ) రాలిపోయింది. మొక్కజొన్న వాడిపోయి తలలు వాల్చింది. ఆగస్టులో పూర్తి కావాల్సిన వరినాట్లు కూడా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆలస్యమయ్యాయి. ఇంకా కొన్నిచోట్ల వరినాట్లు వేస్తున్నారంటే వర్షాభావ పరిస్తితులు వరి సాగునూ ఏ స్థాయిలో ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టులో వర్షాలు ముఖం చాటేయడంతో పూర్తవ్వాల్సిన వరినాట్లు ముందుకు కదలలేదు. దీంతో ముదిరిన నార్లను దున్ని ఇతర పంటలు వేసుకునేందుకు అనువుగా రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు.

మరోవైపు పత్తి మొక్కలు కూడా వర్షాభావం కారణంగా ఎండు ముఖం పట్టాయని, ఎదుగు బొదుగు లేకుండా ఎండి పోయే దశకు చేరాయని ఈ పరిస్థితుల్లో కురిసిన వర్షం పత్తి పంటకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఇక ఈసారి సాగుతో కష్టాలు తప్పవని , అప్పులు తెచ్చి సాగుచేసిన పెట్టుబడి అంతా మీద పడుతుందన్న ఆందోళనలో కూరుకుపోయిన తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వర్షాలు రైతులను ఆదుకున్నాయి. మరో రెండ్రోజులపాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించడంతో రైతులు పత్తి పంటకు రసాయనిక ఎరువులను వేసేందుకు సిద్ధమవుతున్నారు. యూరియా, డీఏపీ, కోరమండల్‌ వంటి కాంప్లెక్స్‌ ఎరువుల కోసం ఫర్టిలైజర్‌ షాపులకు క్యూ కడుతున్నారు.

రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా భారీ వర్షాలు…

తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, సూర్యాపేట, ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement