న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నడి వేసవిలో ఎండలతో మండిపోవాల్సిన పరిస్థితిలో అన్ని రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు పడుతున్నాయి. అకాల వర్షాలతో పంటలు, పండ్ల తోటలు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. తాజాగా మరో 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలతో పాటు అక్కడక్కడా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమ రాజస్థాన్‌లో ధూళి తుఫాన్ సహా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ యూపీ, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. మధ్య భారత దేశంలోని మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, విదర్భ, చత్తీస్‌గఢ్‌లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు భారతదేశంలో అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు వడగళ్ల వానలు పడతాయని హెచ్చరించింది.
దక్షిణ భారతదేశంలో కోస్తా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, కేరళ, తమిళనాడులో మే 3 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలో వడగళ్ల వానలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశంలో మే 4 వరకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, వడగళ్లు పడతాయని పేర్కొంది. పశ్చిమ భారతదేశంలో మరఠ్వాడా ప్రాంతంలో అక్కడక్కడా వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వర్షాల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం తగ్గాయని, రాబోయే నాలుగు రోజుల్లో ఎక్కడా హీట్‌వేవ్ పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 5 నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు.