హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వ్యవసాయ రంగానికి మేలు చేస్తున్నాయి. దీంతో మొన్నటివరకూ ఆందోళన చెందిన రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. గోదావరి నదిలో వరద నీరు నానాటికీ పెరుగుతుండడంతో ఆయకట్టు రైతులు కొండంత ఆశతో పొలం పనులు మొదలుపెట్టారు. మరోవైపు వర్షాల రాకతో గ్రామాల్లో సందడి వాతావరణ నెలకొంది. చెరువులు, కుంటల్లో క్రమేపీ నీరు చేరుతోంది. దీంతో దుక్కి దున్ని పంటలకు సిద్ధం చేసుకున్న భూముల్లో విత్తనాలు వేసేందుకు రైతులు సంసిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ధాన్యం పండించే రైతులంతా వరి నారుమళ్ళు వేసేందుకు చొరవ చూపుతున్నారు. నిన్న, మొన్నటి వరకు కొనుగోలు చేసిన విత్తనాలు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందిన వారంతా ఇప్పుడు చేతికి పని చెబుతున్నారు.
ఈ వర్షాలు ఇంకొన్ని రోజులు కొనసాగితే కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ సాగు పరిస్థితులు ఆశాజనకంగా మారనున్నాయి. వానలు ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ, సాగునీటి పారుదల శాఖల అధికార యంత్రాంగం కూడా కార్యాచరకణ అమలుకు శ్రీకారం చుట్టింది. పక్షం రోజుల ముందుగానే పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం నిధులు కూడా ఖాతాల్లో జమ కావడంతో చిన్న, సన్నకారు రైతులంతా ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వాగుల్లోకి భారీగా నీరు చేరుతుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడలు, ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటి మట్టాలు
వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 4280 క్యూసెక్కుల వరద వస్తున్నట్లుగా బుధవారం మధ్యాహ్నం అధికారులు వెల్లడించారు. జలాశయంలో ప్రస్తుతం 689.42 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా, పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఇక స్వర్ణ ప్రాజెక్టుకు 890 క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటిమట్టం 1164 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1189 అడుగులుగా ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి సరాసరిగా 1500 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1388.32 అడుగుల వద్ద ఉంది. నిజామాబాద్ జిల్లా మాధవ్‌నగర్‌లో వరద ప్రవాహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో నిజామాబాద్-డిచ్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా మళ్ళించారు.
తాలిపేరు ప్రాజెక్టుకు వద్ధ 21 గుట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువన భారీ వర్షాలతో ప్రస్తుతం 8.25 మీటర్ల ఎత్తులో నది పరుగులు పెడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ములుగు జిల్లాలోని పాలెం వాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 4గేట్లు- ఎత్తి 6750 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో 21 గేట్లు ఎత్తి 49,244 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరి నదిలోకి విడుదల చేశారు.
భద్రాచలం వద్ధ పెరుగుతున్న నీటి మట్టం
కాగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 26.7 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 2847 క్యూసెక్కుల వరద వస్తుండగా, 405 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి నీటిసామర్థం 29.917 టీఎంసీలు కాగా, బుధవారం మధ్యాహ్నానికి 18.640 టీఎంసీలకు చేరుకుంది.
నిజామాబాద్ జిల్లాలో జోరుగా వానలు
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 6 సెంటీ-మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. పలుచోట్ల తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో.. పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ప్రాజెక్టుల్లోకి ప్రవాహం పెరుగుతోంది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నవీపేట్ మండలంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతుంది. నిజామాబాద్ నగర శివారులోని గూపన్‌పల్లి ఉన్నత పాఠశాల.. వరద నీటితో చెరువును తలపిస్తోంది. పాఠశాల మొత్తం నీటితో నిండిపోయి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నీటిలో నుంచే రాకపోకలు సాగించాల్సి రావడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
ఖమ్మం జిల్లాలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. సత్తుపల్లిలో ఎడతెరిపి లేని వర్షాలకు బేతుపల్లి చెరువుకు వరద ప్రవాహం పెరిగింది. భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.
7,025 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం
వర్షాల వల్ల భూపాలపల్లి సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లోని కేటీకే 2, 3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తద్వారా 7,025 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఫలితంగా రూ.1.72 కోట్ల నష్టం వాటిల్లింది. 1.63 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత వర్షం కారణంగా ఆగిపోయింది. గనిలో నిలిచిన వర్షపు నీటిని భారీ పంపుల ద్వారా బయటకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. వచ్చే 3 రోజులూ రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగే ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వరంగల్ పైడిపల్లిలో కూలిన ఇల్లు, ఒకరి మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు జలాశయాల్లోకి చేరడంతో అవి జలకళ సంతరించుకుంటున్నాయి. వరంగల్ పైడిపల్లిలో వర్షాల ధాటికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. డీఆర్‌ఎఫ్ సిబ్బంది శిథిలాల నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.
వర్షాలకు రాజధానిలో ట్రాఫిక్ సమస్యలు
రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు వచ్చే మూడు రోజులూ పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి రోజంతా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు అవస్థలు పడ్డారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. ఈ క్రమంలోనే రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..