తమిళనాడును వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాసి జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిశాయి. దీంతో ఐఎండీ నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదివారం అర్థరాత్రి దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెల్లవారుజామున కూడా భారీవర్షాలు కొనసాగాయి.
ప్రస్తుతం కొమోరిన్, దాని పరిసర ప్రాంతాలపై తుపాను ప్రభావం ఉందని, ఇది మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉందని ఐఎండీ అదికారులు తెలిపారు. నాలుగు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా సోమవారం అన్ని విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. వరదనీరు రైలు యార్డుల్లోకి ప్రవేశించాయి. రైలు పట్టాలపైకి వరదనీరు ప్రవేశించడంతో పలు రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. టుటికోరిన్ జిల్లాలోని తిరుచెందూర్‌లో సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల వరకు 606 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడానికి నాలుగు ప్రభావిత జిల్లాలకు మంత్రులను పంపింది. నాలుగు జిల్లాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా నియమించింది.