హైదరాబాద్, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్ల్రో భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా.. ఇవ్వాల (ఆదివారం) రాత్రి హైదరాబాద్ పలు చోట్ల వర్షం పడుతుంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణానగర్, ఫిలింగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, షేక్‌పేట్, మణికొండ, రాయదుర్గం, మెహదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తోపాటు చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. చింతల్, సుచిత్రా, జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.
వర్షం ప్రభావంతో నగరంలోని పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్ల పైకి నీరు వచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి నీటిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఆదివారం కావండతో పలు చోట్ల స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే కొన్ని రోజులుగా ఉక్కపోతతో బాధపడుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది.
ఇక రేపటి (సోమవారం) నుంచి మంగళవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.