రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా చలి తీవ్రత ఎక్కువ ఎక్కువగా కావడంతో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా హైదరాబాద్‌ను వర్షం పలకరించింది.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం జల్లులు కురిశాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కనిపించినప్పటికీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
ఇక రానున్న ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారిందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.