పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్ భారీ వర్షాల తో స్తంభించిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఇక్కడి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే వాటిని దారిమళ్లిస్తున్నారు. వర్షాల కారణంగా భారత్-దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. మన సివిల్ ఏవియేషన్ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లే 15, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత వేగంగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు.
- Advertisement -