Friday, November 22, 2024

Lockdown: రాత్రి వచ్చే రైలు కోసం.. ఉదయం 10 గంటల నుంచే నిరీక్షణ

తెలంగాణలో లాక్‌డౌన్ రైల్వే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో పలు రైళ్లు ఎక్కేందుకు ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఉ.10 గంటల తర్వాత రైలు ఎప్పుడు ఉన్నా.. ప్రయాణికులు మాత్రం ఉదయం 10 గంటలలోపే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నగరంలో వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్‌ల వరకు ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉండడంతో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరినా ఉదయం 10 గంటలలోపే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి వస్తోంది. మరోవైపు, రైలు బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందే ప్రయాణికులను లోపలికి అనుమతిస్తుండడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు.

నాంపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. అయితే ఆ సమయంలో రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ప్రయాణ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం 10 గంటల లోపే రైల్వే స్టేషన్‌కు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 13 గంటలపాటు రైల్వే స్టేషన్‌లో కూర్చుంటూ నిమిషాలు లెక్కిస్తున్నారు. ఈ ఎదురుచూపులతో పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement